మోదీ అడ్వాణీ చెంపపై కొట్టారు

11 May, 2019 04:28 IST|Sakshi
ఉనాలో రాహుల్‌కు సత్కారం

ఓటమి భయంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: రాహుల్‌

చండీగఢ్‌ / సిమ్లా: ప్రధాని మోదీ తనతో పాటు తన కుటుంబాన్ని ఎంతగా ద్వేషించినా తాను ప్రేమతోనే జవాబు ఇస్తానని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ తెలిపారు. ‘మోదీ నాకు, దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాప్తి చేయొచ్చు. కానీ నేను మాత్రం ప్రేమతోనే ఆయనకు జవాబిస్తా’ అని అన్నారు. రాజకీయాలను కబడ్డీ ఆటగా అభివర్ణించిన రాహుల్‌.. ‘మోదీ తన గురువైన అడ్వాణీ చెంపపై కొట్టారు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ గురువైన అడ్వాణీని మోదీ బీజేపీ మార్గదర్శక మండలికి పరిమితం చేయడంపై రాహుల్‌ ఈ మేరకు స్పందించారు.

ఇది రిహార్సల్‌ మాత్రమే..
‘ఇది డ్రస్‌ రిహార్సల్‌ మాత్రమే. మే 23(ఫలితాలు వెలువడే రోజు)న మరో తుపాను వస్తుంది. బీజేపీని కూకటివేళ్లతో సహా పెకలిస్తుంది’ అని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా వెళుతుండటంతో మోదీ కలవరపడుతున్నారని విమర్శించారు. ఈ ఆందోళనలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  మధ్యప్రదేశ్‌లో ఇటీవల ప్రసంగంపై ఈసీ జారీచేసిన షోకాజ్‌ నోటీస్‌పై స్పందించారు. తాను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదనీ, ఓ చట్టానికి సంబంధించిన సవరణను సాధారణ పరిభాషలో ప్రజలకు వివరించానన్నారు.

మరిన్ని వార్తలు