ఎన్నికల్లో విజయమే లక్ష్యం

29 Aug, 2018 01:00 IST|Sakshi
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గ్రూప్‌ ఫొటో

బీజేపీ సీఎంల భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ: రానున్న మూడు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు ఎజెండాగా మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. భేటీని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీ,  14 రాష్ట్రాల బీజేపీ సీఎంలు పాల్గొన్నారు. దళితులు, వెనకబడిన వర్గాల మద్దతు, ఎన్‌ఆర్‌సీ, జాతీయ భద్రత, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది.

దళితులు, అణగారిన వర్గాలు సహా సమాజంలోని దాదాపు అన్ని వర్గాలు లబ్ధి పొందిన తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర నిర్ణయాలను వారికి ప్రధాని మోదీ వివరించారు. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. ‘2014 కన్నా ఎక్కువ మెజారిటీని 2019లో సాధించాలని, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నాం’ అని భేటీ వివరాలను వెల్లడిస్తూ చత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ లక్ష్యాలను కాలపరిమితితో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ భేటీలో తీర్మానం చేశారు.

మరిన్ని వార్తలు