యూపీఏ హయాంలోనే అది సాధించాల్సింది

4 Nov, 2017 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  తమ పాలనలో అభివృద్ధి చేయలేని కొందరు.. ఇప్పుడు చేస్తున్న తాము చేస్తున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రవాసీ భారతీయ కేంద్రంలో శనివారం జరిగిన భారత వ్యాపార సంస్కరణల సదస్సులో మోదీ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. 

‘‘ఆనాడూ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆర్థిక విధానాలు సక్రమంగా అమలు చేసి ఉంటే వారి హయాంలోనే భారత్‌ ఈ ఘనత సాధించింది ఉండేది. కానీ, వారు అప్పుడు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ప్రపంచ బ్యాంక్‌ వారి పాలన సమయంలోనే ఈజ్‌ బిజినెస్ డూయింగ్ ర్యాంకులు ఇవ్వటం మొదలుపెట్టిందన్న మోదీ.. ఇప్పుడు ఆ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవితంలో వరల్డ్‌ బ్యాంక్‌ భవనం మొహం కూడా చూడలేదని ఛలోక్తులు పేల్చాడు. విమర్శలు మాని నవ భారత్‌ కోసం అంతా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

విమర్శకులను తాను పట్టించుకోబోనని.. దేశ ప్రజల జీవితాన్ని మార్చటమే తన ముందున్న లక్ష్యమని మోదీ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన శ్రమను ప్రపంచబ్యాంక్ గుర్తించిందన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఆహ్వానిస్తున్నదని, కేవలం ఒక్క ఏడాదిలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ మెరుగుపడడం అద్భుతమన్నారు. దేశంలో జీఎస్టీ అమలు చేయడం వల్ల వ్యాపారాలు మరింత సులువైనాయని ప్రధాని అన్నారు. జీఎస్టీలో అవసరమైన మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ కలిసి ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది నివేదికలో మరింత మెరుగైన ర్యాంక్‌ను సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత ర్యాంకు 142 నుంచి 100 స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే అది బీజేపీ ప్రభుత్వం సాధించిన ఘనత కాదని.. తమ సంతృప్తి కోసం ఆర్థిక మంత్రి జైట్లీ అలాంటి ప్రకటన చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి మోదీ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని విమర్శించింది.  దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ కూడా ఇచ్చారు. యూపీ పాలనలో ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ కరఫ్షన్‌ గా విరజిల్లిందంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు