మోదీవి విచ్ఛిన్న రాజకీయాలు

21 Oct, 2018 02:46 IST|Sakshi
రోశయ్యకు జ్ఞాపికను బహూకరిస్తున్న రాహుల్‌ గాంధీ. చిత్రంలో ఉత్తమ్, మర్రి తదితరులు

సావర్కర్‌ వీరుడా?
హిందూ జాతీయవాది సావర్కర్‌ ఫొటోను ప్రధాని పార్లమెంటులో ఏర్పాటు చేయడాన్ని రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. సావర్కర్‌ చరిత్ర ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతోపాటు మిగతా కాంగ్రెస్‌ నేతలు జైల్లోనే ఉండగా సావర్కర్‌ మాత్రం తనను జైలు నుంచి విడుదల చేయాలని బ్రిటిషర్లకు లేఖ రాశారని గుర్తుచేశారు. జైలు నుంచి వదిలేయాలని బ్రిటిష్‌ వాళ్లను సావర్కర్‌ వేడుకున్నారని, కాళ్లు పట్టుకుంటా, మీరు చెప్పినట్టు చేస్తానని సావర్కర్‌ ప్రాధేయపడ్డాడని ఆరోపించారు.

అలాంటి వ్యక్తి మోదీ దృష్టిలో వీరుడా అంటూ రాహుల్‌ నిలదీశారు. ఇదేం దేశభక్తి అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు నోట్ల రద్దు అంశంలోనూ బీజేపీకి టీఆర్‌ఎస్‌ అండగా నిలిచిందని, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెంచాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మద్దతిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఐంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాతి, మతం, కులం పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘దేశ సమైక్యత, సమగ్రత కోసం గాంధీ, నెహ్రూ, పటేల్‌ ఎంతో పాటుపడ్డారు. కానీ నేడు జాతి, మతం, కులం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. దేశ ప్రజలకు శాంతి, ప్రేమ, సోదరభావంతో జీవించే హక్కు ఉంది. కానీ ప్రధాని దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు’అని రాహుల్‌ ఆరోపించారు.

మోదీ విధానాలతో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు జంకుతున్నారన్నారు. విచ్ఛిన్న ధోరణుల వల్లే దళితుడైన రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇలాంటి ప్రధానికి టీఆర్‌ఎస్, ఎంఐఎం కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకే ఆలోచనా విధానంతో ముందుకెళ్తున్నాయని ఆరోపించారు.

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద జరిగిన రాజీవ్‌ సద్భావన యాత్ర సభలో రాహుల్‌ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు రాజీవ్‌ సద్భావన అవార్డును రాహుల్‌ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని మోదీ విభజిస్తుంటే ఎంఐఎం ఎందుకు పరోక్షంగా మద్దతిస్తోందని ప్రశ్నించారు. మహారాష్ట్ర, బిహార్, యూపీ ఎన్నికల్లో ఎంఐఎం హిందూ, ముస్లింల ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చిందన్నారు. ఎంఐఎం ఆలోచన సైతం దేశాన్ని విచ్ఛిన్నం చేయడమేనని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో నియంత పాలన...
తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదని, ఐదేళ్లలో తెలంగాణలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబం ఒక్కటేనని ఆయన విమర్శించారు. పాతబస్తీకి మెట్రో రైలు రాలేదని, మెట్రో వస్తే తమ రాత మారుతుందని చిన్న వ్యాపారులు ఆశించినా అలా జరగలేదన్నారు. నోట్ల రద్దుకు సీఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అలాంటి కేసీఆర్‌కు ఎంఐఎం అండగా నిలిచిందన్నారు. నోట్ల రద్దు తర్వాత క్యూలలో మాల్యా, నీరవ్‌ మోదీ, అనిల్‌ అంబానీ నిలబడ్డారా? అని రాహుల్‌ ప్రశ్నించారు. నోట్ల రద్దుతో దోపిడీదారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు