మోదీ మళ్లీ ప్రధాని కాబోరు

9 May, 2019 02:44 IST|Sakshi

హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు

అధికారంలోకి రాగానే ‘పెట్రో’ ఉత్పత్తులను జీఎస్టీలోకి తెస్తాం

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ

మొరేనా/భిండ్‌/గ్వాలియర్‌: ప్రధాని మోదీపై దేశప్రజలు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌  విమర్శించారు. ఆయన మరోసారి ప్రధాని కాబోరని వ్యాఖ్యానించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారనీ, అందుకే ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌లను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనా, గ్వాలియర్, భిండ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ మాట్లాడారు.

అంబానీని కౌగిలించుకోను..
ప్రధాని మోదీకి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ సామాన్యులు, పేదలు, యువతపై లేదని రాహుల్‌ విమర్శించారు. ‘15 మంది బడా పారిశ్రామికవేత్తలకు మోదీ ప్రభుత్వం రూ.5.55 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కానీ రైతులు, యువతపై ఇదే సానుభూతి చూపించలేకపోయింది. ఓ రైతు వ్యవసాయ రుణాలను చెల్లించకలేకపోతే జైలుకు పోతున్నాడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి రైతన్నలను అరెస్ట్‌చేయకుండా చర్యలు తీసుకుంటాం. విదేశాలకు వెళ్లే మోదీ వ్యాపారవేత్తలతో కరచాలనం చేయడంతో పాటు కౌగిలించుకుంటూ ఉంటారు. కానీ నేనుమాత్రం అనిల్‌ అంబానీని ఎప్పుడూ ఆలింగనం చేసుకోను. దేశంలోని పేదప్రజలకు తోడుగా ఉంటాను’ అని తెలిపారు.

అమరులను అవమానించారు..
రఫేల్‌ ఒప్పందాన్ని దొంగలించడం ద్వారా మోదీ అమరుల్ని అవమానించారని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్‌ ఫైటర్‌జెట్లను భారత్‌లో కాకుండా ఫ్రాన్స్‌లో తయారుచేయాలని నిర్ణయించడం ద్వారా భిండ్‌లో వందలాది యువకులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు.

‘రఫేల్‌’పై విచారణ జరుపుతాం
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరుపుతామని రాహుల్‌ ప్రకటించారు. ‘ఈ విచారణలో ప్రధానంగా ఇద్దరి పేర్లే బయటకు వస్తాయి. వాటిలో మోదీ ఒకరు కాగా, అనిల్‌ అంబానీ మరొకరు. మోదీకి దమ్ముంటే అనిల్‌ అంబానీ ఇంట్లో తప్పించి ఎక్కడైనా నాతో బహిరంగ చర్చకు రావాలి. నాతో 15 నిమిషాలు చర్చకు కూర్చుంటే మోదీ దేశానికి ముఖం చూపించుకోలేరు. నిజాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను బీజేపీ ప్రభుత్వం జాగ్రత్తగా విమానంలో వదిలిపెట్టింది. అదే ఉగ్రవాది పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి కారకుడయ్యాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ పోలీస్,  40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు