లక్ష దీవుల్లో 85 శాతం పోలింగెందుకు?

31 May, 2019 17:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపయోగించిన కఠిన పదాలను, పరస్పర దూషణలను మరచిపోదాం. ఇప్పటి నుంచి మనం కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఈ చిన్ని దీవుల్లో మనం పరస్పరం ప్రేమతో జీవించాల్సిన అవసరం ఉంది’ అని లక్షదీవుల నుంచి లోక్‌సభకు ఎన్‌సీపీ తరఫున ఎన్నికైన పీపీ మొహమ్మద్‌ ఫైజల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చిన్న నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుగురు అభ్యర్థులు హోరాహోరీ పోరాటం జరపడం ద్వారా ప్రచారంలో కఠిన పదాలు, పరస్పర దూషణలు చోటు చేసుకున్నాయి. ఇంత తీవ్రంగా ప్రచారం జరగడం వల్లనే దేశంలోనే అత్యధికంగా లక్షదీవుల్లో 85 శాతం పోలింగ్‌ జరిగింది.

మొత్తం 55,057 ఓటర్లలో ఫైజల్‌కు 22,851 (48.6 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి హముదుల్లాహ్‌ సయీద్‌పై 823 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇప్పుడు పునరావృతం అయ్యాయి. నాడు కూడా సయీద్‌పై ఫైజల్‌ పోటీచేసి 1,535 ఓట్ల మెజారితో విజయం సాధించారు. సయీద్‌ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా, ఆయనపై ఫైజల్‌ విజయం సాధించారు. 1957 నుంచి 1967 వరకు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ నాయకుడు నల్లా కోయల్‌ తంగాల్‌ ప్రాతినిథ్యం వహించారు. ఆయన్ని భారత రాష్ట్రపతి నామినేట్‌ చేశారు. 1967లో ఈ సీటుకు మొదటిసారి ఎన్నికలు జరగ్గా స్వతంత్ర అభ్యర్థి పీఎం సయీద్‌ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరి 1971లో పోటీ చేయగా మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వచ్చారు.

2004 ఎన్నికల్లో జనతాదళ్‌ అభ్యర్థి పీ పూకున్హీ కోయా చేతుల్లో సయీద్‌ కేవలం 71 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2005లో సయీద్‌ మరణంతో ఆయన కుమారుడు హముదుల్లా 2009లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా ఆయన ఓడిపోతూ వచ్చారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉండే. అయితే ఆయన వ్యవహార శైలి నచ్చక కొంత మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఫైజల్‌కు ఓటు వేశారు. మహారాష్ట్రలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఇక్కడ విడివిడిగా పోటీ చేశాయి. భారత ఆగ్నేయ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో 78 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 36 దీవుల సమూహమే లక్షదీవులు. వీటిల్లో పది దీవులే జనావాస ప్రాంతాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 65 వేల జనాభా కలిగిన ఈ దీవుల్లో ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 55 వేల మంది ఉన్నారు. వీరిలో 93 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వారు ఇక్కడ సామాజికంగా బాగా వెనకబడిన వారవడంతో వారికి ఈ సీటును రిజర్వ్‌ చేశారు.

మరిన్ని వార్తలు