లోకేష్‌ గెలిస్తే భూకబ్జాలు, దౌర్జన్యాలే..

2 Apr, 2019 05:38 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మోహన్‌బాబు, పక్కన ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల

మంగళగిరిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆర్కేను గెలిపించండి

సినీ నటుడు మోహన్‌బాబు పిలుపు

మంగళగిరి: ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్‌ను గెలిపిస్తే మంగళగిరిలో భూకబ్జాలు, ఇసుక, మట్టి మాఫియాలు రాజ్యమేలుతాయని ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజధానిలో భూములతో పాటు దేవాలయాల భూములను సైతం కొట్టేస్తారని ఆరోపించారు. మంగళగిరి మంగళప్రదాయకంగా ఉండాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా ఇక్కడ అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసే ఆర్కేను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అధికారంలో లేకపోయినా 4 రూపాయిలకే పేదల ఆకలి తీర్చడంతో పాటు పేదలు రుచికరమైన భోజనం చేసేందుకు కూరగాయలు అందజేసిన ఆర్కే సేవలు మరింతగా జరగాలంటే మంగళగిరి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. రాజధానిలో రైతుల భూములతో పాటు ఎంతోమంది పేదల ఇళ్లను ప్రభుత్వం లాక్కోకుండా కాపాడిన ఆర్కే లాంటి నాయకుడు అయితే మంగళగిరి మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. బీసీ మహిళను మోసం చేసిన తండ్రీకొడుకులకు బుద్ధి చెప్పి వెన్నుపోటుకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు. అన్నదాతలు, నేతన్నలు అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తప్పుదోవపట్టించి సీఎం పదవి గుంజుకున్నాడు 
దివంగత ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసే సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని మోహన్‌బాబు తెలిపారు. లక్ష్మీపార్వతిని తప్పించేందుకు ఒక్క రోజు ఎన్టీఆర్‌ను మార్చి మళ్లీ ఆయన పదవి ఆయనకు ఇద్దామని చెప్పడంతో అంతా సహకరించారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు టీడీపీని ఆక్రమించుకుని అన్నగారిని నిలువునా వెన్నుపోటు పొడవడం జీర్ణించుకోలేకపోయానన్నారు. ఐదేళ్ల పాటు బీజేపీతో అంటకాగి అనంతరం కాంగ్రెస్‌ చంకలో దూరి ఇప్పుడు కేసీఆర్, బీజేపీతో వైఎస్‌ జగన్‌ను అంటగట్టడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌ 135 సీట్లలో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఎస్టీ మహిళ భూమి కబ్జా
ఎస్టీ మహిళ మంగేశ్వరి తన కుమారుడు కిషోర్‌తో మోహన్‌బాబును కలిసి తన అర ఎకరా భూమిని టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేశారని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, సీఎం చంద్రబాబు కాళ్లు ఆరుసార్లు, లోకేష్‌ కాళ్లు మూడుసార్లు పట్టుకుని బతిమాలినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ఆవేదనను విన్న మోహన్‌బాబు చంద్రబాబు అధికారంలో ఉంటే పేదల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేదని, ప్రభుత్వం మారిన వెంటనే తప్పనిసరిగా ఆర్కే న్యాయం చేస్తారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, దుగ్గిరాల జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మంగళగిరి, దుగ్గిరాల ఎంపీపీలు పచ్చల రత్నకుమారి, చల్లపల్లి భారతీదేవి, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సంకె సునీత, కౌన్సిలర్‌ కలకోటి స్వరూపారాణి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కాండ్రు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు