డబ్బు, మద్యం వరద

27 Mar, 2019 04:55 IST|Sakshi

ఎన్నికల వేళ రాష్ట్రంలో యధేచ్ఛగా పంపిణీ.. 

25 నాటికి దేశవ్యాప్తంగా రూ.540 కోట్ల విలువైన మద్యం, డబ్బు, ఇతరత్రా వస్తువుల స్వాధీనం

అందులో ఒక్క మన రాష్ట్రంలోనే రూ.103.4 కోట్లు పట్టివేత

దేశవ్యాప్తంగా రూ.143 కోట్ల నగదు సీజ్‌ చేస్తే అందులో మన రాష్ట్ర వాటా రూ.55 కోట్లు

రూ.90 కోట్ల మద్యం పట్టుకుంటే.. ఏపీలోనే రూ.12 కోట్లు

ఈసీ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైన వాస్తవాలివీ..

అధికార టీడీపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు

తెలంగాణలో ఇప్పటివరకు పట్టుకుంది రూ.8.21 కోట్లు మాత్రమే

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం, నగదు వరదలా పారుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచేందుకోసం ఎంతమొత్తమైనా ఖర్చు చేయడానికి రాష్ట్రంలోని అభ్యర్థులు వెనుకాడట్లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన మార్చి 10 నుంచి మార్చి 25 వరకు రూ.539.99 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, బంగారం, వెండి తదితర వస్తువులను పట్టుకుంటే.. కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే రూ.103.4 కోట్లు విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. ఈ విషయంలో రూ.107.24 కోట్లతో తమిళనాడు మొదటిస్థానంలో,  రూ.104.53 కోట్లతో ఉత్తరప్రదేశ్‌ రెండవ స్థానంలో నిలవగా.. ఏపీ మూడో స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటివరకు రూ.8.21 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోగా అంతకు పదమూడు రెట్లకుపైగా ఏపీలో పట్టుపడడం గమనార్హం. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికారులు చక్కగా పనిచేసినందువల్లనే భారీ మొత్తాల్ని స్వాధీనం చేసుకోగలిగినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.

ఎక్కడ చూసినా కట్టలే కట్టలు..
ఇదిలా ఉంటే.. పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉంది. గత 15 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.143.కోట్లు స్వాధీనం చేసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అందులో 30 శాతం అంటే.. 55 కోట్ల నగదును పట్టుకున్నారు. రూ.36.6 కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడలేదు. అయితే ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో భారీగా మద్యం పట్టుపడింది. దేశవ్యాప్తంగా రూ.90 కోట్ల విలువ చేసే మద్యం పట్టుబడింది. ఇందులో రూ.12 కోట్ల విలువైన మద్యం ఏపీలో దొరికింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రూ.22.55 కోట్లు, కర్ణాటకలో రూ.19.88 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి పంజాబ్‌లో రూ.84.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రూ.162 కోట్ల విలువైన బంగారం, వెండి నగలు పట్టుకోగా.. ఒక్క ఏపీలోనే రూ.30 కోట్ల విలువైన నగలు పట్టుకున్నారు. రూ.6 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా ఏపీలో స్వాధీనం చేసుకున్నారు. యూపీలో రూ.59.04 కోట్ల విలువైన బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.8.21 కోట్లు కాగా.. అందులో రూ.5.26 కోట్ల మేర నగదు, రూ.39 లక్షల మద్యం, రూ. 2.38 కోట్ల విలువ గల డ్రగ్స్, రూ.16 లక్షల విలువైన నగలు ఉన్నాయి.

అధికారపార్టీపైనే ఆరోపణలు
రాష్ట్రంలో విచ్చలవిడిగా నగదు పంపిణీలో అధికార టీడీపీపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి అధికారపార్టీ అన్ని అడ్డదారులను వెతుకుతోందని, పెద్దఎత్తున పట్టుబడుతున్న నగదు, మద్యం, చీరలు, సైకిళ్లు, క్రీడా వస్తువులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. నగదు పంపిణీకోసం జిల్లా సహకార బ్యాంకులు, ఆప్కాబ్‌లను వినియోగించుకుంటోందని, నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి ఈ బ్యాంకుల్లో జరుగుతున్న భారీ లావాదేవీల్ని పరిశీలిస్తే నిజాలు బయటికొస్తాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 9 డీసీసీబీలు, ఆప్కాబ్‌ల మేనేజింగ్‌ కమిటీల కాలపరిమితి తీరిపోయినా మరో 6  నెలలపాటు పొడిగిస్తూ గత నెల 12న రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఎన్నికల్లో నగదు పంపిణీకోసమే వీటి కాలపరిమితి పొడిగించారంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అధికారికంగా పట్టుకున్నదే రూ.103 కోట్లు ఉంటే.. దీనికి మూడు, నాలుగింతలు ఈపాటికే పంపిణీ అయి ఉంటుందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది సహకారంతో పకడ్బందీగా నగదు, మద్యం పంపిణీ చేయడానికి తమకు అనుకూలురైన అధికారుల్ని ఎన్నికల ముందు అధికారపార్టీ నియమించుకుందని అవి ఆరోపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు