అది టీడీపీ నగదేనా..?

20 Mar, 2019 13:38 IST|Sakshi
సబ్బవరంలో నగదు లభించిన కారును పరిశీలిస్తున్న పెందుర్తి రిటర్నింగ్‌ అధికారి తేజ్‌ భరత్‌ డబ్బులు తరలిస్తూ దొరికిన కారు

ఓటర్లకు పంపిణీకే తరలిస్తున్నారా..?

సబ్బవరంలో రూ.కోటితో పట్టుబడిన టీడీపీ నాయకుడి కారు

పోలీసులకు దొరికిన తరువాత ఏపీజీవీబీ అధికారుల రంగప్రవేశం

తగిన పత్రాలు, ఎస్కార్ట్‌ లేకుండా బ్యాంక్‌లు భారీ నగదు తరలించవు

అయినప్పటికీ బ్యాంక్‌దే అంటున్న అధికారులు

నగరానికి చెందిన ఓ మంత్రి ద్వారా పెందుర్తికి నగదు తరలించారంటూ ప్రచారం

అందుకు బ్యాంక్‌ అధికారులను వాడుకున్నారా..? అన్న అనుమానం

పెందుర్తి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికలకు మరో 22 రోజుల సమ యం ఉన్న క్రమంలో ముందుగా అన్నీ ‘సర్దు’బాటు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుం టుంది. ఈ క్రమంలో పారదర్శకంగా ఉంటున్న బ్యాంక్‌లను సైతం అధికార పార్టీ వాడుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం సబ్బవరంలో పట్టుబడిన రూ.కోటి నగదు ఈ అనుమానాలను బలపరుస్తుంది. బ్యాంక్‌ నగదు ముసుగులో తరలిపోతున్న ఈ మొత్తాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టుకోవడం సంచలనం రేపిం ది. మంత్రి, టీడీపీ కీలక నేత అయిన వ్యక్తి నుం చి పెందుర్తి నియోజకవర్గానికి ఈ మొత్తం వచ్చి నట్లు స్పష్టమవుతుంది. ఓటమి భయంతో వణుకుతున్న టీడీపీ డబ్బుతో గట్టెక్కాలన్న తాపత్రయం ఈ ఘటనతో బట్టబయలైంది.

నిజంగా బ్యాంక్‌ సొమ్మేనా?
సాదారణంగా ఏ బ్యాంక్‌ సొమ్ము అయినా ఎస్కార్ట్‌ లేకుండా ఇతర శాఖలకు తరలించరు. అదీ నగరం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి అయితే ఆ భద్రత మరింత పగడ్బందీగా ఉంటుంది. అయితే మంగళవారం నగరంలోని సీతంపేట నుంచి పాడేరుకు రూ.కోటి తరలిస్తున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ అధికారులు ప్రాథమిక జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్నదే వేయి డాలర్ల ప్రశ్న. ఏదైనా బ్యాంక్‌ తన ప్రధాన శాఖను నుంచి అనుబంధ  శాఖలకు నగదు తరలిస్తే ఖచ్చితంగా ఇండెంట్‌ పత్రం ఉంటుంది. నగదు తరలింపునకు తప్పనిసరిగా ప్రతీ బ్యాంక్‌కు సొంత వాహనం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయితే ప్రైవేటు ట్రావెల్‌ వాహనాన్ని వినియోగిస్తారు. నగదు తరలింపు వాహనం డ్రైవర్‌ పేరు పత్రాల్లో నమోదు చేస్తారు. అన్నింటికీ మించి ఎన్నికల సమయంలో నగదు తరలిస్తే ఎన్నికల సంఘం/రిటర్నింగ్‌ అధికారి అనుమతి ఇచ్చిన పత్రాలు తప్పనిసరి. కానీ మంగళవారం సబ్బవరంలో బ్యాంక్‌ సొమ్ముగా చెబుతున్న నగదు పట్టుబడిన ఘటనలో అలాంటి ఒక్క పత్రం కూ డా బ్యాంక్‌ అధికారుల వద్ద లభించలేదు. ఆయా ఆధారాల బట్టి ఆ సొమ్ము బ్యాంక్‌దేనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీడీపీ నాయకుడి వాహనమే ఎందుకు
మరోవైపు బ్యాంక్‌ అధికారులకు నగదు తరలింపునకు టీడీపీ నాయకుడి వాహనమే దొరికిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదీ ఎన్నికల సమయంలో ఓ పార్టీకి చెందిన వాహనంలో తమ బ్యాంక్‌కు చెందిన నగదును ఎలా తరలిస్తారన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉండగా నగదు పట్టుబడిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌కు చెందిన ఉన్నతాధికారులు పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. కానీ ఆ నగదుకు సంబంధించిన ఒక్క పత్రం కూడా లేదు. దీనిపై మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించగా మాకేం తెలియదు.. పోలీసులనే అడగండి అంటూ వారు మొహం చాటేయడం అనుమానాలను బలపరుస్తోంది. టీడీపీకి చెందిన నగదును తరలించిన క్రమంలో పట్టుబడడం... దాని నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సదరు బ్యాంక్‌ అధికారులను వాడుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా ‘పంపిణీ’ టీడీపీ బడా నాయకుల కనుసన్నల్లో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నట్లు ఈ ఘటన నిరూపిస్తుంది.

మరిన్ని వార్తలు