సొంతకుంపటి పెట్టుకున్న మాజీ సీఎం సోదరుడు

2 Sep, 2018 16:56 IST|Sakshi
మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్‌

ఢిల్లీ: జాతీయస్థాయిలో మహాకూటమికి చెక్‌ పడేలా కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ సొంత పార్టీ స్థాపించారు. సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా పేరుతో పార్టీని పెట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీతో ఎస్పీ-బీఎస్పీ పొత్తుకు షాక్‌ తగిలేలా ఉంది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యూహం పన్నినట్లు స్థానిక రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్పీ, బీఎస్పీ పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెల్సిందే.

సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని సీట్లలో పోటీ చేస్తుందని చెప్పారు. తన పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీలో తనను పదేపదే అవమానించారని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా 2022 నాటికి బలమైన పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి, అవమానానికి గురైన వారిని తమ పార్టీ ఆహ్వానిస్తుందని శివపాల్‌ తెలిపారు. కార్యకర్తలు గ్రామ, బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని శివపాల్‌ పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు