తొలివిడత బరిలో నేరచరితులు అధికం

6 Apr, 2019 11:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్ధులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. హత్య, మహిళలపై నేరాలు, కిడ్నాప్‌ వంటి తీవ్ర నేరాలు తమపై నమోదయ్యాయని ఆయా అభ్యర్ధులు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షక సంస్థ ఏడీఆర్‌ ఈ వివరాలు తెలిపింది. 1279 మంది అభ్యర్ధులకు గాను 1266 మంది అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఏడీఆర్‌ ఈ డేటాను వెల్లడించింది.

ఇక 1266 మంది అభ్యర్ధుల్లో 12 శాతం మందిపై తీవ్ర క్రిమినల్‌ కేసులు నమోదు కాగా, 12 మంది నేరస్తులుగా నిర్ధారించబడిన వారున్నారు. మరో పది మంది అభ్యర్ధులు తమపై హత్య కేసులున్నాయని ప్రకటించారు. ఇక తమపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని 25 మంది అభ్యర్ధులు ప్రకటించారు. మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయని 16 మంది అభ్యర్ధులు, కిడ్నాప్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నామని నలుగురు అభ్యర్ధులు ప్రకటించారు. ఇక 12 మంది అభ్యర్ధులు తమపై విద్వేష ప్రసంగాలు చేసినందుకు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మరోవైపు ఏప్రిల్‌ 11న తొలివిడత జరిగే 91 నియోజకవర్గాల్లో నేరస్తులు బరిలో ఉన్న 37 నియోజకవర్గాలను రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలుగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు