రేపెవరో!?

19 Feb, 2019 07:39 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలపై టీడీపీలో ఆందోళన

రోజుకొకరు ముఖ్యులు చేరుతుండడంతో సతమతం 

బుజ్జగించేందుకు నానా తంటాలు పడుతున్న బాబు కోటరీ  

అయినా ఫలితం లేకపోవడంతో ఎదురుదాడి 

టీడీపీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు వరుసగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండడం తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. వారం నుంచి రోజుకొకరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తుండడంతో ఏరోజు ఎవరు వెళ్లిపోతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీకి దగ్గరగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్‌ వైఎస్సార్‌సీపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో చంద్రబాబు హైరానా పడుతున్నారు. 

రంగంలోకి బాబు కోటరీ
పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా చూసేందుకు తన కోటరీలోని ముఖ్యులను చంద్రబాబు రంగంలోకి దింపినా ప్రయోజనం ఉండడం లేదు. జిల్లాల వారీగా ఎవరెవరు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు అవకాశాలున్నాయో తెలుసుకుని వారిని బుజ్జగిస్తున్నారు. చాలామందితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతూ బుజ్జగించడం, తన మనుషులను పంపి సర్దిచెప్పడం చేస్తున్నారు. 

ఎదురుదాడి చేసినా ప్రయోజనం లేదే! 
వెళ్లే వారిని ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో వారిపై ఎదురుదాడి చేయాలని ఇప్పటికే చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ మారిన వారు స్వార్థంతో వెళ్లిపోయారని, వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదనే ప్రచారాన్ని మొదలు పెట్టించారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌పై మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు వంటి వారితో ఎదురుదాడి చేయించినా.. తిరిగి వారు గట్టిగా కౌంటర్‌ ఇవ్వడంతో టీడీపీ బేలతనం బయటపడినట్లయింది.

వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీలోకి వెళ్లిన నాయకులెవ్వరూ పదవులకు రాజీనామా చేయలేదు. కానీ టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానిస్తుండడం అధికార పార్టీకి మరింత ఇరకాటంగా మారింది. వైఎస్‌ జగన్‌ నైతికత పాటిస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసునని, తాము చేస్తున్న ఎదురుదాడి కూడా పనిచేయడం లేదనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు