ప్రణబ్‌ కూతురు భయపడ్డట్టే..!

8 Jun, 2018 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘నాన్న(ప్రణబ్‌) ఏం మాట్లాడుతారనేది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టించుకోదు, ఆయన వచనాలేవీ వాళ్లకు గుర్తుండవు.. కొన్ని విజువల్స్ తప్ప!!’’  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి వెళ్లడానికి కొద్ది గంటల ముందు ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. శుక్రవారం తాజాగా ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.. ‘‘దేనిగురించైతే నేను భయపడ్డానో అదే జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే హెచ్చరించా. కార్యక్రమం ముగిసి కొన్ని గంటలు కూడా గడవక ముందే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నీచమైన చర్యలకు పాల్పడుతున్నాయి..’’ అని షర్మిష్ట పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగింది?: ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి ప్రసంగించిన ప్రణబ్‌.. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ఉద్ఘాటించారు. ప్రసంగానికి ముందు వేదికపైనున్న నేతలంతా నిలబడి ‘ఆర్‌ఎస్‌ఎస్‌ సెల్యూట్‌’ చేయగా, ప్రణబ్‌దా మాత్రం అటెన్షన్‌లో ఉన్నారే తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ సెల్యూట్‌ చేయలేదు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ప్రణబ్‌ ఫొటో ఒకటి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్కిళ్ళలో విపరీతంగా షేర్‌ అయింది. అందులో ప్రణబ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ తరహాలో నలుపు టోపీ ధరించి, సేవక్‌ స్టైల్లో సెల్యూట్‌ చేస్తున్నట్లుగా మార్ఫింగ్‌ చేశారు. సదరు ఫొటో వైరల్‌ కావడంతో షర్మిష్ట మళ్లీ స్పందించారు. తాను హెచ్చరించినట్లే జరిగిందని వ్యాఖ్యానించారు.

బర్నల్‌ అమ్మకాలు హై జంప్!‌: కరడుగట్టిన కాంగ్రెస్‌ వాది, రాహుల్‌ గాంధీకి రాజగురువు అయిన ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి వెళ్లడంపై సొంతపార్టీ నేతలే ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఇక గురు, శుక్రవారాల్లో సోషల్‌ మీడియా అంతటా ప్రణబ్‌ను గురించిన చర్చే ఎక్కువగా నడిచింది. పెద్దాయన చర్యతో ఒళ్లుమండిన కాంగ్రెస్‌ నేతలు బర్నల్‌(గాయాలకు పూసుకోడానికి) కోసం వెతుకులాడుతున్నారని బీజేపీ శిబిరం జోకులు పేల్చింది. దుకాణాల్లో బర్నల్‌ దొరకట్లేదని, బర్నల్‌ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా దూసుకెళుతున్నాయని సెటైర్లు వేసింది. అయితే, ప్రణబ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతల సమక్షంలో వారి మౌలిక సిద్ధాంతాలపై సున్నిత విమర్శలు చేయడంతో సీన్‌ రివర్స్‌ అయింది. ‘‘ఇప్పుడా బర్నల్‌ కావలసింది మీకే..’’  అంటూ కాంగ్రెస్‌ శిబిరం కౌంటర్ విసిరింది. (ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రంలో ప్రణబ్‌ ఏం మాట్లాడారు?)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు