చరిత్రలో నిలిచిపోతుంది

9 Jun, 2018 02:18 IST|Sakshi
ఆరెస్సెస్‌ కార్యక్రమంలో ప్రణబ్‌ అసలు ఫొటో (ఎడమ), ఆరెస్సెస్‌ నేతల తరహాలో టోపీతో ప్రణబ్‌ చేయిఎత్తి ప్రతిజ్ఞ చేస్తున్నట్లున్న కల్పిత ఫొటో

ప్రణబ్‌ ప్రసంగంపై అడ్వాణీ ప్రశంస

ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ప్రణబ్‌ మార్ఫింగ్‌ ఫొటో

ఇది సంఘవిద్రోహుల పనేనన్న ఆరెస్సెస్‌

వేదిక కాదు.. చేసిన ప్రసంగాన్ని బట్టే గుర్తింపు: కాంగ్రెస్‌  

న్యూఢిల్లీ: ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సందర్శించటం, భారత జాతీయవాదంపై ఆయన చేసిన ప్రసంగం భారతదేశ సమకాలీన చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోతుందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసినప్పటికీ మోహన్‌ భాగవత్‌ ఆహ్వానాన్ని మన్నించిన ప్రణబ్‌ ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరవడాన్ని అడ్వాణీ ప్రశంసించారు. ‘సిద్ధాంతపరమైన విభేదాలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ ప్రణబ్, భాగవత్‌లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అమూల్యమైనవి. వీరిద్దరూ భిన్నత్వం, ఐకమత్యం, భిన్నమైన విశ్వాసాల గురించి పేర్కొనడాన్ని జీవితకాల స్వయంసేవక్‌గా అభినందిస్తున్నాను’ అని అడ్వాణీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ ఫొటో విద్రోహశక్తుల పనే: సంఘ్‌
ఆరెస్సెస్‌ కూడా ప్రణబ్‌ ప్రసంగాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. మాజీ రాష్ట్రపతి భారత వైభవోపేతమైన చరిత్రను, భారత మూలసూత్రాలైన బహుళత్వం, ఐకమత్యం, భిన్నత్వం గురించి మరోసారి గుర్తుచేశారని పేర్కొంది. ‘మా కార్యక్రమానికి వచ్చి జాతీయత, దేశభక్తి భావాలను బలోపేతం చేసుకునే అంశాలపై మార్గదర్శనం చేసినందుకు ప్రణబ్‌కు కృతజ్ఞతలు’ అని ఆరెస్సెస్‌ ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. కాగా, గురువారం వేదికపై ప్రణబ్‌ ధ్వజప్రణామ్‌ (ఆరెస్సెస్‌ తరహాలో నమస్కారం) చేస్తున్నట్లుగా మార్ఫ్‌డ్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఫొటోలో మార్పు సంఘ విద్రోహశక్తుల పనేనని.. వారే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఉంటారని ఆరెసెస్స్‌ సహ ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ వైద్య మండిపడ్డారు. ఈ శక్తులే మొదట ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ప్రణబ్‌ రాకుండా అడ్డుపడ్డాయని.. ఆ తర్వాత ఆరెస్సెస్‌ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని సంఘ్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  

అనుకున్నట్లే జరిగింది: శర్మిష్ట
తమది ‘ప్రజాస్వామ్యయుత, వివిధ అంశాలపై స్వేచ్ఛగా చర్చించే కుటుంబ’మని ప్రణబ్‌ కూతురు శర్మిష్ట పేర్కొన్నారు. తన తండ్రి అభిప్రాయాలతో విభేదించడంలో ఎవరికీ ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. అంతా తను భయపడినట్లే జరిగిందని ప్రణబ్‌ ఫొటోల మార్ఫింగ్‌పై శర్మిష్ట ఆందోళన వ్యక్తం చేశారు. సంఘ్‌కు ప్రణబ్‌ బహుళత్వం గురించి చెప్పి తన గొప్పదనాన్ని చాటుకున్నారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. అసలైన కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ఆరెస్సెస్‌కు నేర్పించారని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ప్రశంసించారు. ఒక మనిషిని ఆయనకు వచ్చిన ఆహ్వానం ఆధారంగా గుర్తించొద్దని.. ఆయన ప్రసంగాన్ని బట్టే నిర్ణయించాలని మరో కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ పేర్కొన్నారు. అయితే ప్రణబ్‌ తన ప్రసంగంలో.. హెడ్గేవార్, సావర్కర్‌లు చెప్పిన జాతీయవాదం గురించి పేర్కొనలేదని వీహెచ్‌పీ మాజీ నేత ప్రవీణ్‌ తొగాడియా ఇండోర్‌లో పేర్కొన్నారు.  

అప్పుడెందుకలా చెప్పారు? ప్రణబ్‌కు మనీశ్‌ తివారీ ప్రశ్న
న్యూఢిల్లీ: ఆరెస్సెస్‌ కార్యాలయానికి ప్రణబ్‌ వెళ్లడంపై కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయవాదంపై ప్రసంగించేందుకు ఆరెస్సెస్‌ వేదికపైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రణబ్‌ను ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌యూఐలో ఉన్నప్పుడు తనలాంటి వందలాది కార్యకర్తలకు ఆరెస్సెస్‌ గురించి ఎందుకు చెడుగా చెప్పారని, ఇప్పుడు వారిలో ఏం ధర్మంగా, గొప్పగా కనిపించిందో స్పష్టంచేయాలన్నారు. ‘సంఘ్‌ను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రణబ్‌ ప్రయత్నిస్తున్నారా?’ అని  ట్వీట్‌ చేశారు.

ప్రణబ్‌ నాగ్‌పూర్‌ వెళ్లేందుకు కారణాలేమైనా.. అవన్నీ సంఘ్‌ను లౌకికవాద, బహుళత్వ సమాజంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంగానే చూస్తామన్నారు. ‘ఆరెస్సెస్‌ వేదికద్వారానే జాతీయవాదంపై ప్రసంగించాలని ఎందుకు అనుకున్నారు? పార్టీ కార్యకర్తలుగా మాకు 1980, 90ల్లో శిక్షణ ఇస్తున్నప్పుడు మీ తరం నేతలు ఆరెస్సెస్‌ ఉద్దేశాలు, లక్ష్యాలపై జాగ్రత్తగా ఉండమన్నారు. 1975, 1992ల్లో ఆరెస్సెస్‌పై నిషేధం సమయంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఆరెస్సెస్‌ ఎందుకు తప్పనిపించింది? ఇప్పుడెందుకు గొప్ప అనిపించింది? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు