పక్క పక్క వీధుల్లోనే ప్రత్యర్థులు

21 May, 2019 07:15 IST|Sakshi
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేణుకా చౌదరి బి.జనార్దన్‌రెడ్డి

ఒకే రోడ్డులో ఏడుగురు ఎంపీ అభ్యర్థుల నివాసాలు

కౌంటింగ్‌ గడువు సమీపిస్తుండటంతో నేతల ఇళ్ల వద్ద కోలాహలం

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ –12లో సందడి

బంజారాహిల్స్‌: గత నెల జరిగిన  పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాలు ఈ నెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపులో వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో పలువురు ఒకే రోడ్డులో నివాసం ఉండటం గమనార్హం. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లో వివిధ పార్టీలకు చెందిన  అభ్యర్థుల్లో ఆరుగురు సమీపంలోనే నివసిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఇదే రోడ్డులో పక్కపక్క కాలనీలోనే నివసిస్తుంటారు.

చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి బి. జనార్దన్‌రెడ్డి నివాసాలు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఇక ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి రేణుకా చౌదరి, భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రోడ్‌ నం. 12లోనే నివాసం ఉంటారు. ఏపీ విశాఖపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మినారాయణ కూడా ఇదే రోడ్డులో నే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలపై  ఒక వైపు కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డులోనూ వాతావరణంవేడెక్కింది. ఎన్నికల కౌంటింగ్‌ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గతత రెండు రోజులుగా నేతలు, కార్యకర్తలు రాకపోకలతో అభ్యర్థుల నివాసాలు కిటకిటలాడుతున్నాయి.

రాజకీయాలకు వేదికగా నిలిచే బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12 ఉంటున్న రేణుకా చౌదరి గతంలోనే ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కొండావిశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. మిగతావారంతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు.

మరిన్ని వార్తలు