అగ్రవర్ణాలకే పెద్దపీట

19 Nov, 2018 02:30 IST|Sakshi

బీఎల్‌ఎఫ్‌ మినహా ప్రధాన పార్టీల్లో ఓసీలకే ఎక్కువ సీట్లు 

కేవలం ఆరు స్థానాలు కేటాయించిన బీఎల్‌పీ, సీపీఎం 

ఇప్పటివరకు బీసీలకు టీఆర్‌ఎస్‌ 26, కూటమి 26 స్థానాలు 

అత్యధికంగా 59 స్థానాలిచ్చిన బీఎల్‌ఎఫ్‌ 

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలే... ఒకటి అదనంగా ఇచ్చిన కాంగ్రెస్‌ 

బీఎల్‌ఎఫ్‌ మినహాయింపు... మైనార్టీలకు అన్నీ పార్టీలు కలిపి 24 స్థానాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చాయని ఇప్పటివరకు జరిగిన టికెట్ల కేటాయింపు లెక్కలు చెపుతున్నాయి. ఒక్క బహుజన లెఫ్ట్‌ పార్టీ, సీపీఎం కూటమి బీఎల్‌ఎఫ్‌ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తాము ప్రకటించిన స్థానాల్లో అత్యధికం ఓసీలకే ఇచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అందులో 58 అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇక, మహాకూటమి పక్షాన ప్రకటించిన 118 స్థానాల్లో 49 సీట్లు ఓసీలకు ఇచ్చారు. బీజేపీ కూడా 118 స్థానాల్లో 46 ఓసీలకే కేటాయించింది.

బీఎల్‌ఎఫ్‌ మాత్రం 118 స్థానాల్లో ఆరు చోట్ల మాత్రమే ఓసీలకు అవకాశం ఇచ్చింది. ఇక, బీసీల విషయానికి వస్తే టీఆర్‌ఎస్‌ మొత్తం 26 స్థానాలు ఇవ్వగా, ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో కూటమి 26 స్థానాలను కేటాయించింది. బీజేపీ 38 స్థానాలు బీసీలకివ్వగా, బీఎల్‌ఎఫ్‌ 59 చోట్ల బీసీలను నిలబెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు అన్ని పార్టీలు రిజర్వుడు స్థానాలు (ఎస్సీ–19, ఎస్టీ–12) కేటాయించగా, కాంగ్రెస్‌ మాత్రం ఒక జనరల్‌ సీటును అదనంగా ఎస్సీకి కేటాయించింది. బీఎల్‌ఎఫ్‌ మాత్రం రిజర్వేషన్‌ కంటే ఎక్కువగా 28 ఎస్సీలకు, 15 ఎస్టీలకు ఇచ్చింది. మైనార్టీల విషయంలో కూటమి నుంచి 8 మంది, టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, బీఎల్‌ఎఫ్‌ నుంచి 10 మంది బరిలో ఉండనున్నారు. మొత్తంమీద అన్ని పార్టీలు కలిపి 24 మంది మైనార్టీలకు పోటీచేసే అవకాశం కల్పించారు. 


మరిన్ని వార్తలు