బీజేపీలోకి మోత్కుపల్లి

8 Jan, 2020 01:56 IST|Sakshi
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతున్న మోత్కుపల్లి. చిత్రంలో కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో చేరిక

సీఎం కేసీఆర్‌పై మోత్కుపల్లి ధ్వజం

సాక్షి,న్యూఢిల్లీ: మాజీమంత్రి, టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ తీర్థం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌ రావుల సమక్షంలో ఆ పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా నాయకత్వంలో పనిచేసే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

గతంలో నియంత అంటే ఎవరో మనం చూడలేదని, తెలంగాణలో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్, ఇప్పుడు ఎనిమిదో నిజాంగా కేసీఆర్‌ కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు చనిపోయినా ఆయనకు పట్టింపులేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో దళితులకు మంత్రివర్గంలో స్థానం లేదని, ఇది దళిత, పేద, బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ప్రధాని మోదీని గత ఐదేళ్లు సీఎం కేసీఆర్‌ వాడుకున్నారని, అయితే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయనే ప్రధాని కావాలని కలలు కన్నారని, ఆయన ఎవరికీ విశ్వసనీయుడు కాదని, ఆయనకు ఆయనే విశ్వసనీయుడని పేర్కొన్నారు.

బలహీన వర్గాల మద్దతు కూడగడతారు.. 
మోత్కుపల్లి తమ పార్టీలో చేరటం వల్ల బడుగు, బలహీన వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని, పార్టీ బలోపేతమవుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నేడు తెలంగాణలో రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నీతి, నిజాయతీతో పనిచేసిన వ్యక్తి మోత్కుపల్లి అని చెప్పారు. వర్తమాన రాజకీయాల్లో మాకు సలహాలిచ్చే వ్యక్తని, ఆయన రాక ఏపీ, తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తుందన్నారు.

బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ ‘దేశహితం కోసం మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు మోత్కుపల్లి నర్సింహులు ఆకర్షితులయ్యారు. ఇటీవల నేను, కిషన్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించాం. వారు సుముఖత వ్యక్తం చేశారు. అమితాషాను కూడా కలిశార’ని చెప్పారు.

మరిన్ని వార్తలు