‘ఉరితాడు వేసుకుని చంద్రబాబుకు సహకరించా’

2 Mar, 2018 14:35 IST|Sakshi
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మోత్కుపల్లి (పాత ఫొటో)

టీడీపీ కష్టాల్లో ఉంది.. ఓటుకు కోట్లు వల్లే ఈ దుస్థితి

పార్టీ పరిస్థితిపై మోత్కుపల్లి వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : సమున్నత ఆశయాలతో నాడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీటీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రస్తుతం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందని, నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతున్నదని, ఓటుకు కోట్లు కేసు వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా, తర్వాతి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడినా అడిగే దిక్కులేకుండాపోయిందని, పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగానలో తిరగాలని సూచించారు.  

ఉరితాడు వేసుకుని బాబుకు సహకరించా :
 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన సమయంలో టీడీపీ రెండు నాల్కల విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, నాయకులు సైతం తిట్టిపోసినా పట్టించుకోకుండా చంద్రబాబు వెంటే నడిచానని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఉద్యమానికి మద్దతు ఇవ్వనికారణంగా నన్ను చంపడానికి కొందరు నన్ను చంపాలనుకున్నారు. మా ఇంటిని రెక్కీ కూడా చేశారు. అయినాసరే నేను భయపడలేదు. నా జీవితాన్ని బలిచేసి, ఉరితాడు వేసుకుని మరీ చంద్రబాబుకు అండగానిలబడ్డాను. కానీ.. నా త్యాగాలకు విలువలేకుండా పోయిందిప్పుడు. అసమర్థులు, ద్రోహుల చేతికి చంద్రబాబు పార్టీని అప్పగించారు. ఆ నీతిమాలిన, బజారు మనుషుల పక్కనే నేనూ కూర్చోవాల్సి వచ్చింది. అయినాసరే, చంద్రబాబు నాయకత్వాన్నే సమర్థించాను. కానీ ఆయనేం చేశారు? నన్ను పిలవకుండా హైదరాబాద్‌లో మీటింగ్‌ పెట్టారు. ఇది  నన్ను దారుణంగా బాధించింది..

ఓటుకు కోట్లు కేసే కారణం :
గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీ గత ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే, ఓటుకు కోట్లు కేసు తర్వాత అంతా తలకిందులైంది. డబ్బు సంచులతో పట్టుపడ్డ రేవంత్‌ రెడ్డిని ఆనాడే పార్టీ నుంచి బహిష్కరించేదుంటే పార్టీ బతికుండేది. అలా జరగకపోవడం వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు దిక్కులేకుండా పోయింది. స్వయంగా చంద్రబాబు తిరిగితేగానీ తెలంగాణలో మేం బాగుపడం’’ అని మోత్కుపల్లి అన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే టీడీపీ :
‘తెలంగాణలో పార్టీ బతకాలంటే పొత్తులు తప్పనిసరి. ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తాం’అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి స్పందించారు. కాంగ్రెస్‌, బీజేపీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోము కాబట్టి టీఆర్‌ఎస్‌తోనే టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని, చాలా కాలం నుంచే తానీ ప్రతిపాదన చేస్తున్నానని ఆయన గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు