చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు; మహానాడులో కలకలం

28 May, 2018 13:09 IST|Sakshi
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో చంద్రబాబు(పాత ఫొటో), ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కన్నీటిపర్యంతమైన మోత్కుపల్లి.

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో కలకలంరేపాయి. ఆ వెంటనే చంద్రబాబు.. తెలంగాణ నేతలచేత మోత్కుపల్లిని తిట్టించారు.

నట చక్రవర్తి చంద్రబాబు: ‘‘ఎన్టీఆర్‌ మహోన్నత ఆశయంతో టీడీపీని స్థాపించారు. ఆయన వల్లే నాలాంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంతటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్‌ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టపగలే అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌ రెడ్డి, చంద్రబాబులు ముద్దాయిలు. తన అవసరాల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఇప్పుడు బీసీలకు, కాపులకు మధ్య కొట్లాట పెడుతున్నారు. చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చురేపిన మేధావి. నిజంగా ఈ వ్యవస్థకు చంద్రబాబు పెద్ద ముప్పు..

నాకు గవర్నర్‌ పదవి ఇస్తానని..: యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకున్న చంద్రబాబు నాయుడు హోదా పేరెత్తడానికి కొంచమైనా సిగ్గుపడాలి. చరిత్రలో చంద్రబాబుకంటూ ఓక నల్లపేజీ ఉంటుంది. ఈ దుర్మార్గుడిని పాతళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాకు గవర్నర్‌ పదవి లేదంటే రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తానని మాటిచ్చాడు. కానీ రాజ్యసభ సీట్లను వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఎన్టీఆర్‌ నుంచి పార్టీని, జెండాను దొంగిలించిన బాబుతో పోల్చితే.. సొంతగా పార్టీలు పెట్టుకున్న వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌లు నిజమైన మగాళ్లు. ఏపీ ప్రజలు ఈసారి చంద్రబాబును ఓడించాలి..

పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చెయ్‌: ఎన్టీఆర్‌తోపాటు ఆయన కుటుంబీకులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. ముఖ్యమంత్రి అయ్యేదాకా దగ్గుబాటి దంపతులను పక్కన ఉంచుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత కుట్రలు చేశారు. నందమూరి హరికృష్ణనూ పార్టీ నుంచి గెంటేశారు. చివరికి బాలకృష్ణను తన పక్కన పెట్టుకున్నాడు. మోసకారి చంద్రబాబు తక్షణమే టీడీపీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి...’’ అంటూ మోత్కుపల్లి గర్జించారు.

మహానాడులో కలకలం: టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలతో మహానాడులో కలకలం రేగింది. సభా ప్రాంగణమంతా దీని గురించే చర్చ జరిగింది. ఎన్టీఆర​ జయంతినాడే తనపై ఇంత తీవ్రస్థాయిలో దాడిజరడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన తెలంగాణ తెలుగుదేశం నాయకులను రంగంలోకి దించి.. మోత్కుపల్లిని తిట్టించేప్రయత్నం చేశారు. బాబు ఆదేశాలతో మహానాడు ప్రాంగణంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉంటూ ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం మోత్కుపల్లికి తగదని, ఇష్టముంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవచ్చని సండ్ర అన్నారు. ‘మరి మోత్కుపల్లిపై చర్యలు తీసుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం సండ్ర సూటిగా సమాధానం చెప్పలేదు. ‘‘చాలా సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి.. అన్నింటిపైనా చర్యలు తీస్కోలేము’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు