టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలి

18 Jan, 2018 09:48 IST|Sakshi

తెలంగాణలో పార్టీ అంతరించిందనే భావన ఉంది

ఎన్టీఆర్‌ వర్ధంతికి బాబు రావాల్సింది

రాకపోవడం సరికాదన్న టీడీపీ నేత

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమే మంచిది’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్ని పనులున్నా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతికి హాజరు కావాల్సిందన్నారు. ‘‘ఎన్టీఆర్‌ ఘాట్‌ హైదరాబాద్‌లోనే ఉంది. అక్కడికి బాబు రాకపోవడం సరికాదు’’ అని మోత్కుపల్లి అన్నారు.

తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందనే వాతావరణం నెలకొందన్నారు. భుజాన ఎత్తుకొని పార్టీని కాపాడుకుందామన్నా తనకు సహకరించే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ అంతరించిపోయిందని, మనుగడే లేదని అనుకోవడం కంటే టీఆర్‌ఎస్‌లో విలీనం చేయటం మంచిది. టీఆర్‌ఎస్‌ కూడా టీడీపీకి చెందిన పార్టీయే. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ టీడీపీ నుంచి వెళ్లిన వ్యక్తే. టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు’’ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు సమయం కేటాయించలేరని మోత్కుపల్లి చెప్పారు.

‘‘సమయం కేటాయించకపోతే పార్టీ బలోపేతం కాదు. క్రమంగా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోంది. టీడీపీకి తెలంగాణలో గౌరవంగా ఉండాలంటే, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమే మంచిది’’ అని మోత్కుపల్లి పునరుద్ఘాటించారు.  

మరిన్ని వార్తలు