అలిగిన అశోక్‌ !

17 Feb, 2019 07:42 IST|Sakshi
బొబ్బిలిలో మంత్రి సుజయ్‌ తారురోడ్డు పునర్నిర్మాణానికి చేసిన శంకుస్థాపన శిలాఫలకంపై ఎంపీ అశోక్‌గజపతిరాజు పేరులేకపోవడం ఆయనపై పార్టీతీరుకు నిదర్శనం.

టీడీపీ కార్యక్రమాలకు ఎంపీ అశోక్‌ గజపతిరాజు దూరం

మొన్న భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపనకు డుమ్మా

నిన్న పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి గైర్హాజరు

అమిత్‌ షా నగర పర్యటనలో టీడీపీ శ్రేణులను కట్టడి చేసిన కేంద్ర మాజీమంత్రి

భోగాపురం టెండర్ల విషయంలో భేదాభిప్రాయాలే కారణమా

వైఎస్సార్‌సీపీలోకి వలసల నేపథ్యంలో హాట్‌ టాపిక్‌గా మారిన పూసపాటి తీరు

తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్‌. జిల్లాకు ఇప్పటికీ పెద్దదిక్కుగానిలుస్తున్న నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు. ఇప్పుడు ఆయన్ను పార్టీ అధినేతఉద్దేశ పూర్వకంగానే పక్కనపెడుతున్నారా? ఈయన కూడా సీఎం చంద్రబాబుతీరుపై అలకపూనారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టికుని నెంబర్‌–2 స్థానానికి ఎదిగిన అశోక్‌ విషయంలోఏం జరుగుతోంది. ప్రభుత్వ, పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం ఆయనెందుకుదూరంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇవే జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

సాక్షిప్రతినిధి, విజయనగరం: అమరావతిలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శనివారం జరిగింది. రానున్న ఎన్నికల్లో వ్యూహాలపై పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే అత్యం త ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీ అశోక్‌ గజపతి హాజరుకాలేదు. విజయనగరం జిల్లాలో పార్టీకి అశోక్‌ పెద్ద దిక్కుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనగానీ లేదా ఆయన కుమార్తెగానీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పైగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎంపీగా ప్రాతిని ధ్యం వహిస్తున్న సీనియర్‌ నాయకుడై ఉండి పార్టీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే సమావేశానికి ఎందుకు వెళ్లలేదనేది అనుమానాలకు దారితీసింది.

ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకూ గైర్హాజరు
రెండు రోజుల క్రితం జిల్లాలో జరిగిన భోగా పురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్ర యం శంకుస్థాపనకు కూడా అశోక్‌ గజపతి రాలేదు. మొన్నటి వరకూ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్‌ కనీసం ఎంపీ హోదాలోనైనా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయినా అలా జరగలేదు. అంతేగాదు... ఆ రోజు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు జిల్లాలోని నియోజకవర్గస్థాయి నేతల గురిం చి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. కానీ కేంద్రం ఆధీనంలోని విమానాశ్రయం శంకుస్థాపనకు వచ్చి ఆ శాఖ మాజీ మంత్రి గురించిఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే భోగాపురం టెండర్ల విషయంలో చంద్రబాబుతో అశోక్‌కు మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం.

అమిత్‌షా సమావేశానికి పరోక్ష సహకారం
ఇటీవల బీజేజీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విజయనగరంలో బహిరంగ సభ నిర్వహించడానికి వచ్చినపుడు టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అశోక్‌ వద్దనడంతో మౌనం వహించారు. శ్రీకాకుళం జిల్లాలో అదే టీడీపీ శ్రేణులు అమిత్‌ షా గోబ్యాక్‌ అంటూ ఆందోళన చేపట్టారు. ఈ విషయంలోనూ అశోక్‌ తీరుపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ అశోక్‌ తన కుమార్తె అతిథి గజపతిని గతంలో తీసుకువచ్చినపుడు సీఎం చంద్రబాబు వరకూ విషయం వెళ్లడంతో అశోక్‌ను పిలిచి మందలించారు. ఆ తర్వాత ఆమె తెరమరుగయ్యారు. మళ్లీ ఇటీవల జరిగిన సంగీత, నృత్య కళాశాల శతవసంత వేడుకల్లో ఆమె మరలా ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ప్రారంభించారు. ఇది కూడా సీఎంకు, అశోక్‌కు మధ్య అంతరం పెరగడానికి ఓ కారణంగా తెలుస్తోంది.

జిల్లా నేతల తీరుపైనా అసంతృప్తి
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో టీడీపీ శ్రేణులు టచ్‌లో ఉన్నాయి. కానీ ఆ విషయంలోనూ అశోక్‌ అభిప్రాయాన్ని తీసుకోకపోవడంపై చిన్నబుచ్చుకున్న అశోక్‌ అలక వహించినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో అశోక్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలతో ఒక వర్గం పనిచేస్తోంది. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీని వాసరావు వర్గంగా మారిన మీసాల గీత, కె.ఎ. నాయుడు తదితరులు అశోక్‌ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పట్టణంలో తాగునీటి సమస్యను సృష్టించడం కూడా దీనిలో భాగమేనని వార్తలు వచ్చాయి. దీనిపై మీడియాతో అశోక్‌ మాట్లాడుతూ పార్టీపై తనకు అసంతృప్తి లేదనీ, అలా అని పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేనన్నారు. తాను గైర్హాజరుకు కేవలం రవాణా సదుపాయం లేకపోవడమే కారణంగా చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు