ఆ ఎమ్మెల్యే అవినీతి వల్లే విభేదాలు : అవంతి శ్రీనివాస్‌

14 Feb, 2019 17:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం కోసం పనిచేసే తపన ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ మాత్రమే అని భావించినందు వల్లే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం ఆయన విలేరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్‌ జగన్‌ను కలిసినట్లు వెల్లడించారు. పూటకో మాట మార్చే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన ఉందని మండిపడ్డారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన రావాలంటే వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అవినీతి బాగోతం వల్లే విభేదాలు
సీఎం చంద్రబాబు నాయుడు వీలున్నప్పుడల్లా పద్ధతి మార్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారని అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. ‘ఒక టీడీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి సాక్షాత్తూ ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదు వెళ్లింది. ఇక అప్పటి నుంచి ప్రధాని మోదీతో చంద్రబాబుకు విభేదాలు వచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడు ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరు. రాష్ట్రంలోని అవినీతి, బంధుప్రీతి కారణంగానే కేంద్రం మన కోరికలు మన్నించలేదు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసినా హోదాపై ఏమీ సాధించలేకపోయాం. మేం కూడా ఆనాడు వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేస్తే ప్రయోజనం ఉండేది. మనం కూడా రాజీనామా చేద్దామని చెప్తే చంద్రబాబు అస్సలు వినలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబే. వైఎస్‌ జగన్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది’ అని అవంతి వ్యాఖ్యానించారు.

ఇక పార్టీలు మారిన వ్యక్తుల గురించి చంద్రబాబు మాట్లాడాన్ని ఉద్దేశించి... ‘23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు.. పార్టీలు మారడం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఐదేళ్లలో ఏనాడు చంద్రబాబును నా సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదు. ఆయనకు నచ్చినట్లు చేస్తేనే మంచివాళ్లు అంటారు. లేదంటే తనను ప్రశ్నించిన వాళ్లందరినీ అవినీతి పరులుగా ముద్ర వేస్తారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అవంతి రాజీనామాతో టీడీపీకి మరోసారి గట్టి షాక్‌ తగిలింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

.

మరిన్ని వార్తలు