కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు : ఎంపీ అరవింద్‌

26 Jul, 2019 12:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ విమర్శించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఇంటలిజెన్స్‌ సమాచారం’అని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న సదరు వ్యక్తి పాస్‌పోర్టును సీజ్‌ చేసి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. పొట్టకూటికోసం గల్ఫ్‌ బాటపట్టిన ఆ వ్యక్తి ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని చెప్తున్న స్థానిక పోలీసులు... మరి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా పరిగణిస్తారా అని ప్రశ్నించారు.

ఇంటలిజెన్స్‌ రిపోర్టు ఉందని, టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలుస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారని అన్నారు. కేసీఆర్‌పైన కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అందర్నీ ఒకేలా చూడాలని హితవు పలికారు. ఇలాగే వ్యవహరిస్తే.. ఎన్నారైల వద్దకు టీఆర్‌ఎస్‌ వెళ్లకుండా చేస్తామని అన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాయడం మానుకోవాలని.. ఖాకీని కల్తీ చేయొద్దని అన్నారు.

మరిన్ని వార్తలు