ఆ మహిళా ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు రానివ్వలేదు!

27 Sep, 2019 13:50 IST|Sakshi

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిసారిగా ఉద్యమం చేసిన వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వచ్చే వరకు ఎలాంటి పదవులు వద్దన్నా మహానుభావుడు లక్ష్మణ్‌ బాపూజీ అని పేర్కొన్నారు.

హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక పద్మావతి, సైదిరెడ్డి మధ్య పోటీ కాదని , నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఒక నియంత పాలనకు మధ్య జరిగే పోరు అని కోమటిరెడ్డి అభివర్ణించారు. సొంత పార్టీ  శాసనసభ్యురాలిని ప్రగతి భవన్‌కు రానియ్యని పరిస్థితి రాష్టంలో నెలకొన్నదని విమర్శించారు. రాష్ట్ర జనాభాలో 12 శాతమున్న దళిత వర్గానికి మంత్రి పదవి ఇవ్వని దుస్థితి నెలకొందని అన్నారు. మూడు లక్షల తొంభైవేల మంది ఉద్యోగాల కోసం రోడ్లు మీద తిరుగుతున్నారని అన్నారు. సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు ఉమ్మడి చెక్ పవర్ పేరిట లేని పంచాయితీని కేసీఆర్‌ పెట్టారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గౌరవముండాలన్నా.. నియంతృత్వ పాలనకు అడ్డుకట్ట వేయాలన్నా..  హుజూర్‌ నగర్‌లో పద్మావతిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

>
మరిన్ని వార్తలు