రాహుల్‌తో ఎంపీ కొండా భేటీ

22 Nov, 2018 05:13 IST|Sakshi
బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కరచాలనం

సైద్ధాంతిక విభేదాలతోనే టీఆర్‌ఎస్‌ను వీడినట్లు వెల్లడి

‘చేవెళ్ల’ సమస్యలు, ప్రాజెక్టులు సహా పలు అంశాలపై చర్చ

టీఆర్‌ఎస్‌కు బీజేపీతో అవగాహన ఉంది: కుంతియా

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సిద్ధాం తంతోపాటు సెక్యులరిజం నుంచీ టీఆర్‌ఎస్‌ దూరం గా వెళ్లిపోయిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక క్రమంగా వారికి దూర మవుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, హరియాణాకు చెందిన ఎంపీ దీపేందర్‌సింగ్‌ హుడా పాల్గొన్నారు. 15 నిమిషాలు జరిగిన భేటీలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చి నెరవేర్చని ప్రాజెక్టులు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని సమస్యలను రాహుల్‌కు ఆయన వివరించారు.  

కొండా రాకతో పార్టీ బలోపేతం...
అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టడం లాంటి అనేక అంశాలపై టీఆర్‌ఎస్‌తో విభేదిస్తూ కొండా ఆ పార్టీని వీడారన్నారు. ఈ నెల 23న సోనియా, రాహుల్‌ సమక్షంలో సెక్యులర్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరతారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి రాహుల్‌ హామీ ఇవ్వలేదని, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. విశ్వేశ్వర్‌రెడ్డి రాకతో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ వద్ద ఉన్న అనేకమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వారేనని, వారంతా తమతో టచ్‌లో ఉన్నట్లు వివరించారు.

ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నంత మాత్రానా టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ పార్టీ కాబోదని, ఎంఐఎం కూడా బీజేపీ వంటి మతతత్వ పార్టీయేనని మీడియా ప్రశ్నకు బదులిచ్చారు. ముస్లిం ఓటు ఎంఐఎంకు వెళ్లాలి.. హిందూ ఓటు బీజేపీకి వెళ్లాలి.. అన్నది వారి అవగాహన అని అన్నారు. కేసీఆర్‌ బీజేపీకి వ్యతిరేకమైతే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల సమయంలో, పార్లమెంట్‌ తీర్మానాల సమయంలో ప్రతి విషయంలోనూ మద్దతెలా ఇచ్చారని ప్రశ్నించా రు. తెలంగాణలో 9 నెలల ముందుగానే ఎన్నికలు జరపాలన్నది ఓ పథకం ప్రకారం చేశారని, తద్వారా పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరా లన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహమని అన్నారు.  

ప్రజలకు దూరమైన టీఆర్‌ఎస్‌...
టీఆర్‌ఎస్‌ సైద్ధాంతిక మార్పులకు లోనైందని. అం దుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న అసలు సిద్ధాంతాన్ని, సెక్యులరిజాన్ని పక్కకు పెట్టిందన్నా రు. చేవెళ్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాహుల్‌ని కలిశానని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వికారాబాద్‌ను శాటిలైట్‌ సిటీ చేస్తామని, తాండూరు సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని వీటన్నింటినీ నెరవేర్చాలని కోరా నన్నారు.

రాష్ట్రంలోని సాగునీరు, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలపై భేటీలో చర్చించామన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత టీఆర్‌ఎస్‌ ప్రాథమిక ఓటర్లని, ప్రస్తుతం వీరంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పూర్తిగా సైద్ధాంతిక మార్పు కు లోనైందని, దీన్ని సహించలేకే పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ చేయని వాటిని కాంగ్రెస్‌ ద్వారా సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి రాజీనామాపై స్పందిస్తూ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఇస్తానని పేర్కొన్నారు.

మహేందర్‌రెడ్డితో నాలుగేళ్లుగా విభేదాలు..
మంత్రి మహేందర్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు పార్టీలో చేరినప్పటి నుంచి ఉన్నాయని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దాని కోసమే అయితే ఇప్పుడు పార్టీ వీడాల్సిన అవసరం లేదని, ఆ పని నాలుగేళ్ల ముందే చేసేవాడినని తెలిపారు. చిన్నచిన్న వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడేవాడి ని కాదన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో సీఎం మంచిగా ఉండేవారని, అందుకే పలు ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా తక్కువని, అదే కాంగ్రెస్‌లో ఆ వీలు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించగా, గురువారం నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వివరిస్తానని చెప్పారు.

>
మరిన్ని వార్తలు