పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్తేనే మంచిది

14 Feb, 2019 03:12 IST|Sakshi

కాంగ్రెస్‌కు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పొత్తుల్లేకుండా పోటీ చేస్తేనే బాగుంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 16వ లోక్‌సభ చివరి పార్లమెంటు సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీఆర్‌ఎస్‌ను వీడాక సంతోషంగా ఉన్నానని, టీఆర్‌ఎస్‌కు పడే ప్రతి ఓటు బీజేపీకే వెళుతుందని వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభలో 100 కన్నా ఎక్కువ సార్లు మాట్లాడాను.  

వివిధ అంశాలపై లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ విధానాలుగా రూపాంతరం చెందాయి. కేవలం ఎంపీ కార్యాలయంలో ఒక వినూత్న ఆవిష్కరణపై పేటెంట్‌ను పొందిన ఎంపీ కూడా నేనే. ’అని పేర్కొన్నారు. పలు ప్రశ్నలకు బదులిస్తూ ‘మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ సరిగా అమలు చేయలేదు. ఏ నిర్ణయమైనా అందరితో చర్చించి తీసుకోవాలి’అని తెలిపారు. ‘పార్టీ మారినందుకు బాధ లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఏం కోరితే అది చేయాలి. టీఆర్‌ఎస్‌ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరా.

తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, నా నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని అనుకున్నాను. కానీ నేను నా నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. పార్టీ మారాక సంతోషంగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.    

మరిన్ని వార్తలు