రెండింతలిస్తాం.. మీ ఆస్తులిచ్చేస్తారా?

9 Dec, 2017 01:58 IST|Sakshi

మంత్రి లోకేశ్‌కు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాల్‌

పీలేరు: సీఎం కుటుంబ సభ్యులు ప్రకటించిన ఆస్తుల విలువకంటే రెండింతలు ఎక్కువ ఇవ్వడానికి తాము సిద్ధమని, మీ ఆస్తులు ఇచ్చేస్తారా అంటూ మంత్రి లోకేష్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాలు విసిరారు. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కుటుంబం బూటకపు ఆస్తుల వివరాలు ప్రకటించి ప్రజల్ని మభ్యపెడుతోందని విమర్శించారు. ఆస్తుల ప్రకటనను ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు. కల్లబొల్లి మాటలతో నీతివంతులమని గొప్పలు చెప్పుకోవడానికి శ్రమిస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు దమ్ము, ధైర్యముంటే వారు ప్రకటించిన దానికంటే రెండింతలు ఎక్కువ తీసుకుని కుటుంబసభ్యుల ఆస్తులను వదిలేయాలని సవాలు విసిరారు. తద్వారా వచ్చిన డబ్బుల్ని రైతుల రుణమాఫీకి, డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లో విశాలమైన భవంతి ఎందుకు?
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 24 గంటలూ కష్టపడుతున్నారని, నిరాడంబరంగా గడుపుతున్నారని, చేతికి ఉంగరం కూడా లేదని నీతులు చెబుతున్న లోకేష్‌ హైదరాబాద్‌లో విశాలమైన భవంతి ఎందుకు నిర్మించారో చెప్పాలని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాపురమున్నవారు ఎన్‌ఆర్‌ఐలు అన్న లోకేష్‌ వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావిస్తూ.. కల్లబొల్లి మాటలు కట్టబెట్టి హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు అమ్మేసి అమరావతిలో ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ నివాసి కావాలని సూచించారు. 

మరిన్ని వార్తలు