త్వరలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం: రేవంత్‌రెడ్డి

13 Sep, 2019 11:24 IST|Sakshi
అమీర్‌పేట్‌ కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

బీజేపీ–టీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అనేవిధంగా వ్యవహరిస్తున్నాయి

కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు

అమీర్‌పేట్‌ కాంగ్రెస్‌ నాయకులతో ఎంపీ రేవంత్‌రెడ్డి

సాక్షి, మహేశ్వరం: త్వరలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం రాబోతోందని, కార్యకర్తలెవ్వరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు వన్నాడ మనోహర్‌గౌడ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2023లో కేంద్రం, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపర్చడానికి టీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. బీజేపీ–టీఆర్‌ఎస్‌ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ  బలపడుతుందని వాపును చూసి బలుపు అనుకునే అనేవిధంగా హైప్‌ చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు, కార్యకర్తలు త్వరలో కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం ఖాయమన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తామని, నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చాకలి యాదయ్య,  కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల రఘుపతి, పార్టీ నాయకులు ప్రసాద్, ఈశ్వర్,శ్రీరాములు , అనిల్‌కుమార్, భాస్కర్, రాజు, చంద్రమోహన్, రమేష్, ఆనంద్, ,బాలు పలువురు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు