‘ఆ చట్టం అమలుపై కేసీఆర్‌ వైఖరి స్పష్టం చేయాలి’

20 Dec, 2019 09:35 IST|Sakshi
మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరి స్పష్టం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోని నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోమని అక్కడి ముఖ్యమంత్రులు స్పష్టం చేశారని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనంగా ఉండడంతో ప్రజలు అపోహలకు గురవుతున్నారని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటు వేశారని, అమలు విషయంలో ఎటూ తేల్చలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరి స్పష్టంగా వెల్లడించామని పేర్కొన్నారు. బీజేపీ మత ప్రాతిపదికన చట్టం చేసిందని, దీని వల్ల దేశ వ్యాప్తంగా అశాంతి నెలకొందన్నారు. అదే విధంగా ఎన్‌ఆర్‌సీ కూడా ఓ వర్గాన్ని టార్గెట్‌ చేసే విధంగా ఉందన్నారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, నా యకులు సాముల శివారెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి  ఉన్నారు.  

మరిన్ని వార్తలు