నీచ రాజకీయాలను తిప్పికొట్టండి

25 Jun, 2018 03:47 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

 వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి  వి.విజయసాయిరెడ్డి  

విజయనగరం మున్సిపాలిటీ: గత ఎన్నికలలో 600కు పైగా బూటకపు హమీలిచ్చి అమలుచేయని సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనూ అదే తరహాలో గెలిచేందుకు చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. విజయనగరంలో ఆదివారం బూత్‌ లెవెల్‌ కమిటీల నిర్మాణం, పార్టీ బలోపేతంపై విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ధనంతో చంద్రబాబు పార్టీ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలనే తపనతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో బోగస్‌ ఓటర్లను చేర్పించారన్నారు. టీడీపీ క్షేత్ర స్థాయిలో చేస్తున్న కుటిల రాజకీయాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బూత్‌ కమిటీలు సమర్ధవంతంగా ఎదుర్కొని రానున్న ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కార్యకర్తలంతా సన్నద్ధం కావాలన్నారు. 

విశ్వాసపరులను నియమించండి: భూమన     
ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి విశ్వాస పాత్రులు, నిజాయితీగల వ్యక్తులకు బూత్‌ కమిటీల్లో స్థానం కల్పించి విజయావకాశాలు సుస్థిరం చేసుకోవాలన్నారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 4.60 లక్షల మంది సాధికారమిత్రలను నియమించుకుని వారికి ప్రజాధనంతో జీతాలు చెల్లించి టీడీపీ ప్రచారానికి వినియోగించుకోవటం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సాగిదుర్గా ప్రసాదరాజు, రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు