ఇంటింటికా.. ఓకే!

17 Nov, 2018 03:12 IST|Sakshi
2013 మిజోరం అసెంబ్లీ (మొత్తం 40) ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ పార్టీలు సాధించిన సీట్ల వివరాలివి. ఇక్కడ బీజేపీ మొదట్నుంచీ బరిలో ఉన్నా ఒక్క సీటు కూడా గెలవలేదు.

ప్రచారాలకు మేమూ వస్తాం

ప్రలోభాలకు గురిచేయకుండా మిజోరంలో ఎంపీఎఫ్‌  నిర్ణయం

మిజోరం ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్ధులు ఇకపై ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికలంటేనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడమే కదా, మళ్లీ కొత్తగా చెప్పేదేంటి అనుకుంటున్నారా? ఇది తెలియాంటే మీకు మిజోరామ్‌ పీపుల్స్‌ ఫోరమ్‌ (ఎంపీఎఫ్‌) గురించి తెలియాలి. ఎన్నికల సమయంలో ఎంపీఎఫ్‌ సంస్థ వాచ్‌డాగ్‌ లాగా పనిచేస్తుంది. చర్చి అండతో ఏర్పాటైన ఎంపీఎఫ్‌లో పలు ప్రభుత్వేతర ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఎంపీఎఫ్‌ శాసిస్తుంది, ప్రజలు పాటిస్తారు. అదంతే. దాన్నెవరూ మార్చలేరు. ఎంపీఎఫ్‌ పుణ్యమా అని మిజోరంలో గత రెండు ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారానికి అవకాశం లేదు. ఏదైనా నియోజకవర్గంలో పోటీపడుతున్న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరూ ఒకే ఉమ్మడి వేదికపైనే ప్రచారం చేసుకోవాల్సి వచ్చేది. ఆయా అభ్యర్థులు తమ గుణగణాలు, తామేం చేయదలచుకున్నది ఆ వేదిక ద్వారా ప్రజలకు చెప్పేవారు.  అభ్యర్థులు కూడా ఎంపీఎఫ్‌ను కాదని ముందడుగు వేయడానికి సాహసించలేదు.

గత రెండు ఎన్నికల్లోనూ ఇదే స్టాండ్‌ తీసుకున్న ఎంపీఎఫ్‌ ఈసారికి నిబంధనలను కాస్త సడలించింది. ఒకే వేదిక ప్రచార విధానాన్ని పక్కనపెట్టి ఇంటింటి ప్రచారానికి అనుమతించింది. దీంతో పార్టీలు ఎగిరిగంతేశాయి. అయితే ఎంపీఎఫ్‌ ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఇంటింటికీ తిరిగే అభ్యర్ధుల వెంట కార్యకర్తలు ఉండకూడదు, అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసేందుకు ఆయనతోపాటు ఎంపీఎఫ్‌ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి.

ఇది వినేందుకు కాస్తంత ఇబ్బదికరంగానే ఉన్నా.. పాపం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఇచ్చారుగా అన్న సంతోషంతో పార్టీలన్నీ ఈ నిబంధనకు అంగీకరించాయి. 2006లో ఎంపీఎఫ్‌ ఏర్పాటైంది. అంతకుముందు ఎన్నికల సందర్భంగా హింస, ప్రలోభాలు తీవ్రస్థాయిలో ఉండేవని, వీటిని అడ్డుకునేందుకే.. చర్చి రంగంలోకి దిగి ఈ ఫోరమ్‌ ఏర్పరిచిందని ప్రతినిధులు చెప్పారు. తమ సంస్థ ఏపార్టీకీ అనుకూలం కాదని, తాము ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎంపీఎఫ్‌ కళ్లు గప్పి ఓటర్లను ప్రలోభపెడుతోందని మిజో పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఎంపీఎఫ్‌ సభ్యులను కలుపుకుని ప్రచారానికి వెళ్లడం అసౌకర్యంగా ఉందని మెజారిటీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు