అధిష్టానంతో మాట్లాడాకే రాజీనామా చేస్తా

17 Jul, 2018 06:27 IST|Sakshi
రాజీనామా లేఖను చూపుతున్న పెనుగొండ ఎంపీపీ సురేఖ

పెనుగొండ: ఎంపీపీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని, అయితే అధిష్టానానికి ఇక్కడి పరిస్థితిని వివరించాకే చేస్తానని పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖ స్పష్టం చేశారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేకపోయినా, ఒప్పంద ఉల్లంఘన అంటూ ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. అయినా రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు వివరించారు. ఈ మేరకు ముందే సిద్ధం చేసుకున్న రాజీనామా లేఖను విలేకర్లకు చూపించారు. ఈ నెల 25వ తేదీ అనంతరం రాజీనామా లేఖను అందచేస్తానని వివరించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎన్నికల ముందు జరిగిన, ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలు వివరిస్తాననితెలిపారు. తన వాణి అధిష్టానం వద్ద వివరించిన అనంతరం రాజీనామా చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు తనను ఓడించడానికి కొందరు ప్రయత్నం చేసినా ప్రజల అండతో గెలిచానన్నారు. ఎన్నికల అనంతరం అవాంతరాలు కూడా సృష్టించారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ, పార్టీ పటిష్టతకు కృషి చేశానని తెలిపారు.

2న అవిశ్వాస తీర్మానం
ఆగస్టు 2వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన 18 మంది ఎంపీటీసీలు, ఓ కోఆప్షన్‌ సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని కొవ్వూరు ఆర్డీవో వైఎస్‌వీకేజీఎస్‌ఎల్‌ సత్యనారాయణకు అందించారు. ఎంపీపీ పదవికి రాజీనామాపై ఇరువర్గాల మధ్య ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. ఎంపీపీని అయిదేళ్లలో రెండు భాగాలు పంచుకోవాలని నిర్ణయించుకొని మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖకు, రెండవ భాగంలోని రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతికి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 5వ తేదీ 2017 సంవత్సరం నాటికి పల్లి జూలీ సురేఖకు పదవీ కాలం ముగిసింది. అయితే, ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని, ఎన్నికల అనంతరం బలవంతంగా ఒప్పందం చేశారని ఆరోపిస్తూ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేయడానికి ససేమీరా అనడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఎంపీటీసీలు అందరూ సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును ఆర్డీవోకు అందించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం విశేషం. రాజీనామాకు దారి తీసిన సంఘటనలు, అవిశ్వాస తీర్మానం వెనుక ఉన్న రాజకీయాలను అధిష్టానానికి వివరించిన తరువాతే రాజీనామా చేస్తానని సురేఖ చెప్పడం కొస మెరుపు. 

మరిన్ని వార్తలు