-

నేటి నుంచి నామినేషన్లు

22 Apr, 2019 12:18 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. స్థానిక పోరు మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలిదశ ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇదే రోజు నుంచి తొలిపోరు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీలు, ఏడు జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. నామినేషన్ల దాఖలులో కొంత సమయం పెంచారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకే అవకాశం ఇవ్వగా.. ప్రాదేశిక ఎన్నికలకు మాత్రం సమయాన్ని మరింత పొడిగించారు.

ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు 24వ తేదీ ఆఖరు. తొలిదశగా ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇందులో ఆరు పాత మండలాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి సంబంధించి నామినేషన్ల కేంద్రాన్ని హయత్‌నగర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నామినేషన్ల అందజేతకు అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలి. ఈ వివరాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలి.

ఎన్నికల వ్యయ ఖర్చులన్నీ ఈ ఖాతా నుంచే జరపాలి. గతం కంటే ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచారు. జెడ్పీటీసీకి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, ఎంపీటీసీకి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీకి పోటీచేసే జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎంపీటీసీకి రూ.2.500 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు డిపాజిట్‌ మొత్తంలో కాస్త మినహాయింపు ఇచ్చారు. జెడ్పీటీసీకి రూ.2,500, ఎంపీటీసీకి రూ.1.250 డిపాజిట్‌ చేస్తే సరిపోతుంది. అయితే, ఈ అభ్యర్థులు తప్పనిసరి కులధ్రువీకరణ పత్రం లేదా గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన డిక్లరేషన్‌ అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్ల వయసు నిండి ఉండాలి. ఒక్కరోజు తక్కువగా ఉన్నా అభ్యర్థి నామినేషన్లను తిరస్కరిస్తారు.

మరిన్ని వార్తలు