ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్‌ మద్దతు

27 Nov, 2018 05:50 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

కూటమిపక్షాన ప్రచారం: మందకృష్ణ

అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లు

ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్‌ ఓడాలి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మార్పీఎస్‌ ప్రతిపాదనలకు కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందిం చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్లమెం ట్‌లో ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణమాదిగతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి.

దీంతో ఎమ్మార్పీఎస్‌ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో వర్గీకరణబిల్లు ప్రవేశపెట్టి ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో ఒత్తిడి తేవాలనే ప్రతిపాదనకు కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించినందుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఉత్తమ్, కుంతియాతో కలిసి మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఎస్సీ వర్గీకరణపై మాట తప్పారని, అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ దొంగదీక్షను ప్రశ్నించినందుకు కక్షగట్టి తనను జైల్లో పెట్టారని విమర్శించారు.

తెలంగాణకు స్వేచ్ఛ ను ప్రసాదించిన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీపై కేసీఆర్‌ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోనియా ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానం చెప్పకుండా హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. సూట్‌కేసులు కావాలనుకుంటే సోనియా తెలంగాణను ఇచ్చేదికాదని, కేసీఆర్‌కు సంచులు కావాలి కాబట్టే, సూట్‌కేసులని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌కు ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎక్కువ సంచులు ఇస్తారు, కాబట్టి వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టారు’ అని విమర్శించారు. కేసీఆర్‌ అమరావతికి వెళ్లినప్పుడు చంద్రబాబు ఆంధ్రావాడని గుర్తుకు రాలేదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడిం చడానికి ఎమ్మార్పీఎస్‌ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్‌ ఓడిపోవాలని స్పష్టం చేశారు

కేసీఆర్‌ దళిత ద్రోహి: ఉత్తమ్‌
కేసీఆర్‌ దళితద్రోహి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీలను సులువుగా మోసం చేయడం కేసీఆర్‌కు తెలుసని అన్నారు. దళితులను నాలుగున్నరేళ్లు మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉందని, ఆ వర్గానికి చెందిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి హోదా నుండి ఎందుకు తొలగించారో ఇప్పటికీ తెలియదన్నారు. సిరిసిల్లలో దళితులను హింసించిన కేసీఆర్‌ను దళితులు విస్మరించారని పేర్కొన్నారు. మందకృష్ణ పోరాటం తెలంగాణ సమాజానికి తెలుసని, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రజాకూటమి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అనేది ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామిటెడ్‌ పోస్టులు ఇచ్చి గౌరవిస్తామని హామీనిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే రాష్ట్రంలో ప్రజా స్వామ్యం బతుకుతుందన్నారు.

అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లు
కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పార్లమెం ట్‌లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని కుంతియా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్‌ ప్రతిపాదనలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజాకూటమిలోకి మందకృష్ణను సాదరంగా ఆహ్వానించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆయనను కేసీఆర్‌ జైల్లో పెట్టడం దారుణమన్నారు.

మరిన్ని వార్తలు