బాబుకు తెలంగాణ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు

13 Dec, 2018 04:40 IST|Sakshi

ఏపీ ప్రజలూ అందుకు సిద్ధంగా ఉన్నారు: ముద్రగడ  

కిర్లంపూడి(జగ్గంపేట): ‘‘సీఎం చంద్రబాబు ఒక గజదొంగ. రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నాడు. అది చాలక తెలంగాణలో ఉన్న వనరులను, ఆస్తులను కబళించి కబ్జా చేయాలని మహాకూటమి పేరుతో ఆ రాష్ట్రంలో వేలు పెట్టాడు. చంద్రబాబును కోలుకోలేని దెబ్బకొట్టి వెనక్కు పంపించిన తెలంగాణ ప్రజల చైతన్యానికిదే నా నమస్కారాలు’’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో జేఏసీ నాయకులతో కలసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. లగడపాటితో గరుడ పురాణం చెప్పించి ప్రజల ఆస్తులను పందేల రూపంలో తగలేయించిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని ఆ దేవుడే కాపాడారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కూడా ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అప్పుడే రాష్ట్రానికి దరిద్రం వదిలిపోతుందని అన్నారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రానిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడన్నారు. తమ జాతికిచ్చిన హామీపై ప్రతిసారీ రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదంటూ వంకలు చెప్పడం మంచిది కాదన్నారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు చట్టాలు, రూల్స్‌ వంటివి గుర్తుకొస్తాయి కానీ.. మీ కుమారుడి విషయంలో అవి ఎందుకు వర్తించవని నిలదీశారు. ఇలాంటి గజదొంగ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నారు.  ఈనెల 23న 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులతో సమావేశమై వారి సలహాలు, సూచనల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తుమ్మలపల్లి రమేష్, జీవీ రమణ, గౌతుస్వామి, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు