‘పవన్.. అప్పటిదాకా ఇంటిమొహం చూడొద్దు’

21 Apr, 2018 19:44 IST|Sakshi
ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్‌ (ఫైల్ ఫొటో)

పవన్ కల్యాణ్‌కు లేఖ రాసిన ముద్రగడ

సాక్షి, రాజమండ్రి: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పోరాటానికి మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్‌కు సూచించారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు. 'మీ తల్లికి జరిగిన అవమానం తట్టుకోలేక దీక్షకు దిగారని తెలిసింది. మీ తల్లికి జరిగిన అవమానం నాకు బాధ కలిగించింది. చంద్రబాబులాంటి దుర్మార్గుడిని మీరు భుజాలపైకి ఎక్కించుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తే నా కుటుంబాన్ని అవమానించారు. బూతులు తిడుతూ కుటుంబసభ్యులను కొట్టారు. ఆఖరికి తుందూరు ఆక్వా పార్క్ గురించి చెప్పుకునేందుకు మీ వద్దకు వచ్చిన వారిపై కేసులు పెట్టారు.

టీడీపీని సముద్రంలో కలిపేందుకు 24 గంటలు కష్టపడంది. మీ కుటుంబానికి జరిగిన అవమానం గురించి కేసు పెట్టి కోర్టుకు వెళ్లాలనే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఒక మెట్టు దిగి అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలని, ఇతర పార్టీల సహకారంతో చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పాలి. అమ్మకు జరిగిన అవమానాన్ని పక్కనపెట్టి రోడ్డు మీదకు రండి. టీడీపీని నిమజ్జనం చేసేవరకూ ఇంటిమొహం చూడవద్దంటూ' పవన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన లేఖలో సూచించారు.

పవన్ కల్యాణ్‌కు ముద్రగడ రాసిన లేఖ..

>
మరిన్ని వార్తలు