చంద్రబాబుపై సీబీఐ విచారణ చేపట్టాలి

12 May, 2018 04:39 IST|Sakshi

     విభజన హామీలు నెరవేర్చాలి

     ప్రధాని మోదీకి ముద్రగడ లేఖ

కిర్లంపూడి (జగ్గంపేట): అవినీతి సామ్రాట్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీబీఐ, ఇన్‌కంట్యాక్స్, ఈడీ తదితర శాఖల ద్వారా ఏకకాలంలో దర్యాప్తు చేయించి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్రమోదీకి శుక్రవారం లేఖ రాశారు. లేఖ సారాంశం ఈ విధంగా ఉంది.. ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి మీరు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒప్పందం చేసుకున్నారో తెలియదు గానీ ఆ హోదా సాధన పేరుతో ప్రజాధనాన్ని, అతిదారుణంగా ఖర్చు చేస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేస్తున్నారన్నారు.

ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు నుంచి కాపాడడమే పెద్ద తప్పిదమన్నారు. చంద్రబాబును ఆరోజే జైలుకు పంపించి ఉంటే రెండు రకాల నష్టం జరిగి ఉండేదికాదన్నారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పనులు రాష్ట్ర పర్యవేక్షణలో చేయాలనే నిర్ణయంతో అడ్డగోలు అవినీతికి తెరదీసిందన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుకను ఉచితం పేరుతో రూ.కోట్ల దోపిడీ చేస్తున్నారన్నారు. వారి భాగస్వామ్యంతో ఉన్న గనుల వ్యాపారాలకు, రోడ్లు వేయడానికి రూ.కోట్లు ఇస్తున్నారని, ప్రజల అవసరాల కోసం గుంత రోడ్లను సరిచేయడానికి నిధులు లేవంటున్నారన్నారు.

ఈ మధ్య హోదా పోరాటం పేరుతో గత నెల 20న పుట్టిన రోజుకి, 30న పెళ్లి రోజుకి జరిపిన వేడుకల సభలకి ప్రజాధనాన్ని వెచ్చించడం క్షమించరాని నేరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. పేద రాష్ట్రమని ఓ వైపు చెబుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలుచేయడం సమంజసమా అని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఇటువంటి దోపిడీ ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. చంద్రబాబుపై తక్షణమే దర్యాప్తు చేయాలన్నారు. ప్రత్యేక హోదాను, రైల్వే జోన్, కడప స్టీల్‌ ప్లాంట్‌తోపాటు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో మిగిలిన హామీలు అమలు చేయాలని లేఖలో కోరారు.

మరిన్ని వార్తలు