మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

30 Jul, 2019 08:57 IST|Sakshi

కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభం  

రెండుసార్లు మంత్రిగా సేవలు గ్రేటర్‌పై తనదైన ముద్ర  

మాస్‌ లీడర్‌గా గుర్తింపు చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగిన నేత  

ఆయన మృతితో గోషామహల్‌లో విషాదం

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ గ్రేటర్‌పై తనదైన ముద్ర వేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నేతగా రాజకీయ అరంగ్రేటం చేసిన ముఖేష్‌గౌడ్‌..  1986లో కాంగ్రెస్‌ తరఫున జాంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1989, 2004, 2009లలో ఎమ్మెల్యేగా విజయం సాధించి..రెండుసార్లు మంత్రిగా సేవలందించారు. గ్రేటర్‌ కాంగ్రెస్‌ ప్రముఖుల్లో ఒకరైన ముఖేష్‌గౌడ్‌..మాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందారు. పీజేఆర్‌
మరణానంతరం గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానంనాగేందర్‌తో కలిసి పార్టీని ముందుకునడిపించారు. అందుకే వీరిద్దరినీ ‘హైదరాబాద్‌ బ్రదర్స్‌’గా పిలిచేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వీరికి మంత్రి పదవులు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నేత రాజాసింగ్‌ చేతిలో ఓటమి పాలైన ముఖేష్‌గౌడ్‌.. తర్వాత కేన్సర్‌ వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఏడు శస్త్రచికిత్సలు చేసినా ఆయన ఆరోగ్యంమెరుగుపడకపోగా... శరీరం వైద్యానికిసహకరించకపోవడంతో ముఖేష్‌గౌడ్‌ సోమవారం తుది శ్వాస విడిచారు.

సుల్తాన్‌బజార్‌: కాంగ్రెస్‌నేత, మాజీ మంత్రి మూల ముఖేష్‌ గౌడ్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కన్ను మూయడంతోగోషామహల్‌ నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖేష్‌ గౌడ్‌ కేన్సర్‌ వ్యాధికి అపోలో ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌లో బలమైన నాయకుడిని కోల్పోయినట్టయింది. 1959 జూలై 1న జన్మించిన ముఖేష్‌గౌడ్‌కు విక్రంగౌడ్, విశాల్‌గౌడ్, కుమార్తె శిల్ప సంతానం. ఆయన కుమారుడు విక్రంగౌడ్‌ పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, ఆయన మృతి వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు నాయకులు, రాజకీయ ప్రముఖులు ముఖే ష్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 

మరిన్ని వార్తలు