పార్టీ ఎంపీపై సీఎం ఆరేళ్ల నిషేధం

25 Sep, 2017 18:23 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు ముకుల్ రాయ్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించడంపై పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముకుల్ రాయ్ ప్రకటన వెలువడిన కొన్నిగంటల్లోనే పార్టీ నుంచి ఆయనను ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకనేతగా ఉంటూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నేత ముకుల్ రాయ్ పార్టీ సభ్యత్వానికి ఇతర పదవులకు రాజీనామా చేస్తానన్న ప్రకటనను తృణమూల్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది.

'పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మొదట రాజీనామా చేస్తాను. నేటి దుర్గా పూజల్లో పాల్గొన్న అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పుకుంటాను. అదే సమయంలో పార్టీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నానో అందరి సమక్షంలో వెల్లడిస్తాను. భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని' ముకుల్ రాయ్ తెలిపారు. పార్టీలో మమతా బెనర్జీ తర్వాత కీలకనేతల్లో రాయ్ ఒకరు. ఇంకా చెప్పాలంటే మమతకు కుడిభుజంగా రాయ్ పేరును పేర్కొంటారు.

శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌ బయటకు వచ్చాక ముకుల్ రాయ్‌ని మమతా బెనర్జీ పార్టీ జనరల్‌ సెక్రెటరీ పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి పార్టీ విషయాలకు దూరంగా ఉంటున్న ఆయన తృణమూల్‌నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాయ్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొన్ని గంటల్లో రాయ్ వెల్లడించే విషయాలు పశ్చిమబెంగాల్ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు