అఖిలేష్‌ నిర్ణయంపై ములాయం ఆగ్రహం..!

21 Feb, 2019 18:27 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ పొత్తువల్ల ఎస్పీ తీవ్రంగా నష్టపోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని కాపాడాల్సిన వారే బద్ధ శత్రువైన బహుజన్‌ సమాజ్‌వాది పార్టీతో చేతులు కలిపి భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పటిష్టమైన ఎస్పీని సొంత మనుషులే నాశనం చేస్తున్నారని వాపోయారు. (మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ములాయం)

యూపీలో ఉన్న 80 ఎంపీ స్ధానాలకు గాను ఎస్పీ 37, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేస్తాయని మయావతి, అఖిలేష్‌ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పార్టీ కార్యకర్తల సమావేశంలో ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి 38 సీట్లు కేటాయించడం మరీ మింగుడు పడని వ్యవహారమని అన్నారు. ఇక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాలతో కలిసి అఖిలేష్‌ అడుగులేస్తుండగా.. మళ్లీ మోదీయే ప్రధాని కావాలని పార్లమెంటు సాక్షిగా ములాయం ఆకాక్షించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. (పొత్తు ఖరారు : బీఎస్పీ 38, ఎస్పీ 37)

మరిన్ని వార్తలు