'సాధ్యంకాని బుల్లెట్‌ రైలు ఎందుకో అర్థం కావట్లే..'

4 Oct, 2017 10:24 IST|Sakshi

ముంబయి : ఓ పక్క నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నారని తీవ్ర ఊహాగానాలు రేకెత్తుతుండగా వాటిని ఆయన పటాపంచలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల భారత వృద్ధి రేటు నెమ్మదించిందని అన్నారు. కశ్మీర్‌ పాలసీతోపాటు, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును కూడా విమర్శించారు. బుల్లెట్‌ రైలు అనేది ఆచరణ సాధ్యంకాదని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పొందే ప్రయోజనాలు, ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపుల్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.

'మహారాష్ట్రకు కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఇచ్చారు. కానీ, ఎక్కువ స్టేషన్లు గుజరాత్‌కు ఉన్నాయి. అసలు బుల్లెట్‌ రైలు వెనుక ఉద్దేశం ఏమిటో నాకు ఇప్పటి వరకు తెలియడం లేదు. వాస్తవానికి బుల్లెట్‌ రైలు కావాల్సింది ఒక ముంబయికి ఢిల్లీకి మధ్య. లేదంటే ఢిల్లీకి కోల్‌కతాకు మధ్య లేదా ముంబయి చెన్నై మధ్య. ముంబయి అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ఆచరణ సాధ్యం కాదు. అయితే, గుజరాత్‌కు వచ్చే ప్రయోజనాలు తాను కాదనబోనని, అయితే, మహారాష్ట్రకు జరిగే నష్టం గురించే తాను ఎత్తి చూపాలని అనుకుంటున్నానని తెలిపారు.

మరిన్ని వార్తలు