ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!

11 Sep, 2019 11:23 IST|Sakshi

నార్త్‌ ముంబై నాయకులే బాధ్యత వహించాలి

ముంబై: బాలీవుడ్‌ నటి ఊర్మిల మంటోడ్కర్‌ రాజీనామాపై ముంబై కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ మిలింద్‌ దేవరా తాజాగా స్పందించారు. ఊర్మిళ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడానికి నార్త్‌ ముంబై లీడర్లే కారణమని ఆయన విమర్శించారు. ఆమె రాజీనామాకు వారే బాధ్యత వహించాలన్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఊర్మిళకు తాను మనస్ఫూర్తిగా సహకరించానని, ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో ఆమెకు అండగా నిలబడ్డానని ఆయన పేర్కొన్నారు. ఊర్మిళను పార్టీలోకి తీసుకొచ్చిన నాయకులే ఆమెను రాజకీయంగా తొక్కేశారని, ఆ సమయంలోనూ ఆమెకు తాను మద్దతుగా నిలబడ్డానని చెప్పారు. ఆమె రాజీనామాకు ఉత్తర ముంబై కాంగ్రెస్‌ నాయకులే కారణమన్న వ్యాఖ్యలతో తాను వందశాతం ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రతి పార్టీలోనూ అంతర్గత విభేదాలు ఉంటాయని, ఊర్మిళ తన రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ కోరారు.

బాలీవుడ్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు.

మరిన్ని వార్తలు