కాంగ్రెస్‌లో బీఫాం రగడ! 

15 Jan, 2020 02:03 IST|Sakshi

ఒకే వార్డు నుంచి ఇద్దరికి 

ఆర్వో నుంచి లాక్కెళ్లి చింపివేత 

మెదక్‌ రూరల్‌: కాంగ్రెస్‌లో బీఫాం లొల్లికి దారితీసింది. ఒకే వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థులకు నాటకీయ పరిణామాల మధ్య బీఫాం కేటాయించారు. దీంతో ఆందోళనకు గురైన ఓ అభ్యర్థి తరఫు వ్యక్తి రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ మీది నుంచి బీఫాం తీసుకెళ్లి చింపేశాడు. ఈ ఘటన మెదక్‌ మున్సిపల్‌లో మంగళవారం జరిగింది. మెదక్‌ పట్టణం 16వ వార్డు రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఆ వార్డులో బరిలో నిలిచిన అభ్యర్థి నాయకుడిన చంద్రకళకు మొదటగా కాంగ్రెస్‌ నుంచి బీఫాం కేటాయించారు. మంగళవారం ఉద యం 10:30 గంటలకు రిటర్నింగ్‌ అధికారికి బీఫాం అందజేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చంద్రకళకు బీఫాం రద్దు చేస్తూ అదే వార్డు నుంచి ఒద్ది వసంత్‌రాజ్‌ పేరిట బీఫాంను రిటర్నింగ్‌ అధికారికి కాంగ్రెస్‌ అందజేసింది.

ఇది తెలుసుకున్న మొదటి అభ్యర్థి చంద్రకళకు సంబంధించిన కాంగ్రెస్‌ నేత, మాజీ కౌన్సిలర్‌ శేఖర్‌ రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌పై ఉన్న వసంత్‌రాజ్‌ బీఫాంను తీసుకెళ్లి చింపివేశారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపుచేసి బీఫాం చింపివేసిన వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత 16వ వార్డు నుంచి చంద్రకళ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే తమకు మొదటగా ఇచ్చిన బీఫాంను చివరి క్షణంలో టీఆర్‌ఎస్‌లో పనిచేసిన వ్యక్తికి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని మాజీ కౌన్సిలర్‌ శేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు