ప్రభాకర్‌ చౌదరిని ఓడిస్తాం : మునిరత్నం

19 Mar, 2019 16:54 IST|Sakshi

తనకు ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని మునిరత్నం డిమాండ్‌

సాక్షి, అనంతపురం : అనంతపురం అర్బన్‌ టీడీపీలో నిరసన సెగలు భగ్గుమన్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. ప్రభాకర్‌ చౌదరిపై ప్రజా వ్యతిరేకత ఉన్న కారణంగా ఆయనను మార్చాలని టీడీపీ నేత మునిరత్నం డిమాండ్‌ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ అన్ని వర్గాలు ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకిస్తున్నాయి. ఆయనకు సీటు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. నాకు సీటు ఇస్తామని స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభాకర్ చౌదరికి సీటు ఇస్తే సహకరించేది లేదు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయాన్ని సుజనా చౌదరికి, యనునమలకు స్పష్టంగా చెప్పాము అని పేర్కొన్నారు.

బలిజలకు అన్యాయం జరుగుతోంది..
అనంతపురం టీడీపీ అర్బన్‌ సీటును బలిజలకు కేటాయించాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో బలిజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ అనంత అర్బన్‌ సీటును బలిజలకు ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని విఙ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. అనంతపురంలో జేసీ మాట కూడా చెల్లుబాటు కాలేదని ఆయన వర్గీయులు వాపోయారు. గుంతకల్‌, అనంతపురం టిక్కెట్లను సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇస్తే ఓటమి తప్పదని జేసీ హెచ్చరించినా వారికే టికెట్లను కేటాయించి చంద్రబాబు ఆయనకు షాక్‌ ఇచ్చారు. ఆయనను నమ్ముకుని టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాకు కూడా భంగపాటు తప్పలేదు. మరోవైపు జేసీ సూచించినట్లుగా శింగనమల అసెంబ్లీ స్థానాన్ని బండారు శ్రావణికి కేటాయించడంతో...సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీ బాలకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై యామినీ బాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని శ్రావణికి టికెట్‌ ఎలా ఇస్తారని మండిపడ్డారు.(అలా అయితే మాకు ఓటమే : జేసీ)

మరిన్ని వార్తలు