బ్రేకింగ్‌: కుట్రకోణంపై దర్యాప్తు జరపాలి: హైకోర్టులో జగన్‌ పిటిషన్‌

31 Oct, 2018 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు దర్యాప్తులో కుట్రకోణాన్ని ఏపీ పోలీసులు విస్మరించారని పిటిషన్‌లో వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ కేసు విచారణను సక్రమంగా జరపడంలో ఏపీ సర్కారు విఫలమైందని ఆయన తెలిపారు. ఈ కేసులోని కుట్రకోణంపై సజావుగా దర్యాప్తు జరిపించాలని వైఎస్‌ జగన్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌లో మొత్తం ఎనిమిది మందిని వైఎస్‌ జగన్‌ ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఏపీ డీజీపీ, సిట్‌ ఇన్‌చార్జి ఏసీపీ, ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఎస్‌హెచ్‌వో.. తదితరులతోపాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కూడా వైస్‌ జగన్‌ ప్రతివాదిగా చేర్చారు. ఆయన దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణను చేపట్టనుంది.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూ.. ఏపీ ప్రభుత్వ తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తాను తీసుకెళుతున్నానని వైఎస్‌ జగన్‌ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడున్న నేపథ్యంలో ఆపరేషన్‌ గరుడ పేరుతో ఓ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని, ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్‌ ఇది అంటూ ప్రచారం చేశారని వైఎస్‌ జగన్‌ తన పిటిషన్‌లో హైకోర్టు దృష్టికి తెచ్చారు. ‘టీడీపీ సానుభూతిపరుడైన సినీ నటుడు శివాజీయే ఆపరేషన్‌ గరుడ పాత్రధారి.. పాదయాత్రలో భాగంగా నాపై దాడి జరుగుతుందని శివాజీ గతంలో ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ పతనానికి అది దారితీస్తుందని శివాజీ చెప్పారు’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదొక భారీ కుట్ర అని అర్థమవుతోందని, ప్రతిపక్ష నేతను హత్య చేసి.. అది ఆపరేషన్‌ గరుడలో భాగమని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

అక్టోబర్‌ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో విశాఖ ఎయిర్‌పోర్టుకు తాను వచ్చానని, విమానాశ్రయం లాంజ్‌లో కూర్చుని ఉండగా రెస్టారెంట్‌లో పనిచేసే ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ దగ్గరికి వచ్చి.. తనపై దాడి చేయబోయాడని వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. పదునైన కత్తితో దుండగుడు తనపై దాడి చేశాడని, ఈ దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నానని, తాను కిందికి వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలోకి గుచ్చుకుందని, దీంతో ప్రాణాపాయం తప్పిందని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో తెలిపారు.

 ‘‘దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నేను హైదరాబాద్‌ వచ్చాను. సిటీ న్యూరో ఆస్పత్రిలో వైద్యులు నాకు చికిత్స అందించి.. గాయానికి9 కుట్లు వేశారు. నాపై దాడి జరిగిన గంట సమయంలోనే ఏపీ డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి.. పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందంటూ దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు కూడా ప్రెస్‌మీట్‌ నిర్వహించి.. ఇదంతా ఆపరేషన్‌ గరుడలో భాగమని చెప్పారు. దాడి చాలా చిన్న విషయమంటూ సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారహితంగా ప్రవర్తించారు. పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో నాపై జరిగింది హత్యాయత్నమేనని తేల్చారు. వేర్వేరు చేతిరాతలతో ఉన్న పదిపేజీల లేఖను పోలీసులు విడుదల చేసి.. ఘటన జరిగిన గంటలోనే ఓ ప్లెక్సీని తెరపైకి తెచ్చారు. దాడి చేసిన నిందితుడు వైఎస్సార్‌సీపీ అభిమాని అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. హత్యాయత్నాన్ని కప్పిపుచ్చేలా సీఎం, డీజీపీల ప్రకటనలు ఉన్నాయి. ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు. నా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా ఏపీ పోలీసుల విచారణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపించండి’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హైకోర్టును కోరారు.

మరిన్ని వార్తలు