ముస్లిం యువకుల అరెస్ట్‌ అన్యాయం

30 Aug, 2018 07:03 IST|Sakshi
బాధితులను పరామర్శిస్తున్న శిల్పా రవి, హఫీజ్‌ఖాన్‌

నంద్యాల(కర్నూలు): న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులను అరెస్ట్‌ చేయడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ నేతలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌ అన్నారు. నారా హహమారా..టీడీపీ హమారా కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకున్న 8 మంది ముస్లింలు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో, వారిని  వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం రాత్రి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శిల్పా, హఫీజ్‌ఖాన్‌మాట్లాడుతూ ..నాలుగున్నరేళ్ళ పాలనలో కనిపించని ముస్లింలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కనిపించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సభలో ప్లకార్డులు పట్టుకుంటే దేశద్రోహం కేసు అయినట్లు యువకులను నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు.

ముస్లింలపై చంద్రబాబుకు ఏ పాటి ప్రేమ ఉందో ఈ సంఘటన తెలియజేస్తోందన్నారు. వక్స్‌ భూముల పరిరక్షించాలని కోరడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు.  హిట్లర్‌లా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం ఇచ్చిన హామీలు నెరవెర్చలేదన్నారు. నాలుగున్నరేళ్లు ప్రధాని మోదీతో జతకట్టి, ఎన్నికల సమయంలో ముస్లిం  ఓట్లు పడవని బీజేపీతో దూరంగా ఉండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అరెస్ట్‌ చేసిన యువకులను బేషరతుగా విడుదల చేసి నంద్యాలకు పంపకపోతే అధికారపార్టీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

వైస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ యువజన విభాగం అధ్యక్షుడు పీపీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువకుల అక్రమ అరెస్ట్‌ను ప్రతి ఒక్కరు నిరసించాలన్నారు. ఇలాంటి చర్యలకు దిగితే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ముస్లింలకు అండగా వైఎస్సార్సీఈపీ ఉంటుందని, ఎవరూ అందోళన చెందల్సిన అవసరం లేదన్నారు. 
అరెస్ట్‌ చేసిన యువకులను వెంటనే విడుదల చేయకపోతే భారీ ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు ఇస్సాక్‌ బాషా,  కౌన్సిలర్‌లు అనిల్‌ అమృతరాజ్, జాకీర్‌ హుసేన్, సుబ్బరాయుడు, శోభారాణి, నాయకులు జగన్‌ ప్రసాద్, పాంషావలి, టైలర్‌శివ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శన 
కర్నూలు (ఓల్డ్‌సిటీ):
 
ముస్లింల పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్నది కపటప్రేమేనని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా, టీడీపీ హమారా’ కార్యక్రమంలో ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడాన్ని జీర్ణించుకోలేక తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ సంఘటనకు నిరసనగా బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటినుంచీ ముస్లింల వ్యతిరేకి అని, వారికి మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

ముస్లిం యువకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. మైనారిటీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎ.రహ్మాన్‌ మాట్లాడుతూ నచ్చని అంశాలపై నిరసన తెల్పుకోవడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కన్నారు. గుంటూరులో అరెస్టు చేసిన ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు ధనుంజయాచారి, ఫిరోజ్, జమీల, సలోమి, సపియా ఖాతూన్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, ఖాదర్‌ఖాన్, నజీర్‌అహ్మద్‌ఖాన్, గఫూర్‌ఖాన్, సయ్యద్‌ ఆసిఫ్,  శ్రీనివాసరెడ్డి, మాధవస్వామి, గణపచెన్నప్ప, అల్లాబకష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు