నిధులు కావాలి కానీ అప్పులు వద్దంటే ఎలా?

23 Feb, 2019 15:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవై ఏళ్లు గోస పడ్డ తెలంగాణను ఈ అయిదేళ్లలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. సాగు, త్రాగు నీరు, పవర్‌, రైతు బంధు లాంటి పథకాలు పెట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. ప్రతి అంశాన్ని అవగాహన చేసుకొని​సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారని చెప్పారు.

గతంలో ఉన్న నేతలు సభలో ఉబ్బాలు కొట్టుకునేవారు కానీ అభివృద్ధిపై చర్చించేవారు కాదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీధర్‌ బాబు.. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క యూనిట్‌ కూడా కరెంట్‌ ఎక్కువగా ఉత్పత్తి చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నీరు అందుతోందని చెప్పారు. వ్యవసాయానికి కూడా సాగు నీరు పుష్కలంగా అందుతోందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణను అనుకరిస్తుందన్నారునిధులు, అభివృద్ధి కావాలంటారు కానీఅప్పులు వద్దంటారు.. మరి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. గత ప్రభుత్వాలు అప్పులు చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా.. ఇంకా మారలేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు