బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

17 Jul, 2019 04:46 IST|Sakshi

ట్విట్టర్‌లో ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా పరస్పర ఆరోపణలు

నిస్సహాయ స్థితిలో చంద్రబాబు

వెంకన్నను నియంత్రించకపోతే రాజీనామా చేస్తానని కేశినేని బెదిరింపు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రాజధాని బెజవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కలహించుకుంటూ చేస్తున్న రచ్చ ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. టీడీపీ నేతలు రోడ్డుపైకెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారని పార్టీ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. వీరిని నియంత్రించలేకపోవడం ఆయన నిస్సహాయ పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. విజయవాడలో టీడీపీ ముఖ్య నేతలైన ఎంపీ కేశినేని నాని, నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్‌లో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాలుదువ్వుతున్నారు.

పార్టీ పరువును బజారున పడేస్తున్నా చంద్రబాబు వారిని నియంత్రించలేకపోతున్నారు. నాని, బుద్ధా రెండ్రోజులుగా ట్విట్టర్‌లో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకుంటున్నా పార్టీలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇద్దరూ గల్లీ నాయకుల కంటే దారుణంగా తిట్టుకుంటున్నారు. బుద్ధా వెంకన్న గుళ్లో కొబ్బరి చిప్పలు, సైకిల్‌ బెల్లుల దొంగ అని కేశినేని నాని ట్వీట్‌ చేస్తే, నాని దొంగ పర్మిట్లతో బస్సులు నడిపాడని, మాజీ స్పీకర్‌ బాలయోగి ఆస్తులు కాజేసిన దొంగని, మోసగాడని అని బుద్ధా వెంకన్న ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఇలా ఒకరి బండారాన్ని మరొకరు బయటపెట్టుకుంటుండడంతో టీడీపీ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు.  

కేశినేని టార్గెట్‌ చంద్రబాబే
ఇటీవల కాలంలో టీడీపీ అధినాయకత్వంపై సునిశిత విమర్శలు చేస్తూ వస్తున్న ఎంపీ కేశినేని నాని సోమవారం ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబుపైనే గురిపెట్టారు. తనలాంటి వారు అవసరం లేదనుకుంటే ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, తాను పార్టీలో కొనసాగాలంటే మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌లో పెట్టుకోవాలని హెచ్చరిక ధోరణితో ట్వీట్‌ చేశారు. కేశినేని నాని ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుండడం, ఆయన తనపైనే కొద్ది రోజులుగా విమర్శలు చేస్తుండడంతో చంద్రబాబు నేరుగా ఆయన్ను మందలించే సాహసం చేయలేదు.

మరోవైపు బుద్ధా వెంకన్న తన వీరాభిమాని కాబట్టి ఆయన్ను వారించే ప్రయత్నమూ చంద్రబాబు చేయలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతల్ని రంగంలోకి దించి చంద్రబాబు ఇద్దరినీ బుజ్జగించారు. అయితే చంద్రబాబు తన బినామీలుగా ఉన్న సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపినట్లే కేశినేని నానిని కూడా ఆ పార్టీలోకి పంపే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేయిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు