చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది : నాగిరెడ్డి

10 Apr, 2019 15:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికలకు ముందు ప్లాన్‌ చేసుకుని అధికారులను బదిలీ చేశారని, ఇప్పుడు అలాంటి అధికారులపై ఈసీ చర్య తీసుకోవడంతో చంద్రబాబు ప్లాన్‌ బెడిసికొడుతుందని అందుకే ఆయన భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను నియమించిన ఏజంట్లు బదిలీ కావటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని నిలదీశారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

వివేకానంద హత్య అంశంపై కోర్టు ప్రస్తావించవద్దన్నా చంద్రబాబు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబుకు భయం పట్టుకుందని ప్రజల్లో సానుభూతి కోసమే నిరసన దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ముఖ్యమంత్రి లెటర్‌ ప్యాడ్‌ మీద ప్రజలను ఓట్లు అర్థిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. ఐదేళ్లు తమతో పని చేసిన అధికారులను నియమిస్తే ఉలుకుపాటు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై ఆయనకు నమ్మకం లేదా అని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు