సోనియా నిజమైన ఇండియన్‌

11 May, 2018 01:57 IST|Sakshi
బెంగళూరులో మీడియా సమావేశంలో రాహుల్, సిద్దరామయ్య

మోదీ విమర్శలు ఆయన స్థాయికి తగినవి కావు

బెంగళూరులో మీడియా సమావేశంలో రాహుల్‌గాంధీ

సాక్షి, బెంగళూరు: తన తల్లి సోనియాగాంధీ విదేశీయతను ప్రధాని మోదీ ప్రస్తావించడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తప్పుపట్టారు. దేశంలో తాను చూసిన చాలామంది భారతీయుల కంటే సోనియా నిజమైన భారతీయురాలన్నారు. మోదీ తనలో ముప్పును చూస్తున్నారని, ప్రధాని కావాలన్న తన ఆకాంక్షపై ఆయన చేస్తున్న విమర్శలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకేనని తప్పుపట్టారు. ‘నా తల్లి ఇటలీలో జన్మించినా భారత్‌లోనే ఎక్కువ కాలం జీవించింది. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనను, తన తల్లిని ఇటలీ వాళ్లు అని సంభోధించడం ప్రధాని స్థాయి వ్యక్తికి సరికాదు. మోదీ చేసే అలాంటి వ్యాఖ్యలు ఆయన స్వభావాన్ని తెలియచేస్తాయి’ అని అన్నారు. గురువారం బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా తమ సంకల్పాన్ని దెబ్బతీయలేరని చెప్పారు.  

ఎవరు కావాలి?
ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించిన సిద్దరామయ్య కావాలో.. లేక జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప కావాలో ప్రజలకు బాగా తెలుసునని రాహుల్‌ అన్నారు. అవినీతి గురించి తరచూ మాట్లాడే ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన యడ్యూరప్పను పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారని∙ప్రశ్నించారు. దళితుల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీనేనని, దళితుడైన రోహిత్‌ వేముల మృతిపై దేశమంతా ఏకరువు పెడుతుంటే ప్రధాని మోదీ ఒక్క మాట అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి గురించి 15 నిమిషాలు తన మాతృభాషలో మోదీ చెప్పగలరా? అని నిలదీశారు. దేశం మొత్తం మీద దళితులకు కేటాయించిన నిధుల్లో సగం ఒక్క కర్ణాటక ప్రభుత్వమే కేటాయించిందన్నారు.  

అన్ని మతాలను గౌరవిస్తా
ఎంతో చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తాను అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పారు. కొన్ని పార్టీల తరహాలో మత ఘర్షణలు, విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడబోనని రాహుల్‌ స్పష్టం చేశారు. మోదీ అవలంబిస్తున్న విదేశాంగ విధానాలు దేశాన్ని ఆత్మ రక్షణలో పడేయడం ఖాయమని ఆయన విమర్శించారు. యూపీఏ కంటే ఎన్డీయే హయాంలోనే పెట్రోల్‌ ధరలు భారీ పెరిగాయన్నారు. కన్నడ ప్రజల భాష, ఆహారం, అలవాట్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులు చేస్తోందని ఆరోపించారు. కన్నడిగుల మనోభావాలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. బెంగళూరును సిలికాన్‌ వ్యాలీగా మార్చడంలో కాంగ్రెస్‌ పార్టీ కృషి ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. కర్ణాటకలో నిరుద్యోగం అనే మాట వినపడకుండా చేస్తామని రాహుల్‌గాంధీ హామీనిచ్చారు.   

మోదీ వైఫల్యాలనుప్రజలు గమనించారు: సిద్దరామయ్య  
సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామని.. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రధాని మోదీ వైఫల్యాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందని చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తే బాగుంటుందని అన్నారు. అమిత్‌ షావి వట్టి మాటలేనని.. చేతల్లో ఏమీ ఉండదని విమర్శించారు. నాలుగేళ్లలో దేశానికి ఏమీ చేశారో చెప్పకుండా కేవలం రాహుల్‌ గాంధీని విమర్శించడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఆయన తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు